PM Modi: ఏ దేశానికీ సాధ్యం కాని ఫీట్ ను సాధించింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా నిలిచి చరిత్ర సృష్టించింది. భారతీయులను గర్వపడేలా చేసిన ఆగస్టు 23వ తేదీని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. బ్రిక్స్ శిఖారాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రధాని.. ఈరోజు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ లో శాస్త్రవేత్తలను కలిసి స్వయంగా అభినందించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత అంతరిక్షణ పరిశోధనా సంస్థ - ఇస్రో చరిత్ర సృష్టించిన ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్షణ దినోత్సవం (నేషనల్ స్పేస్ డే)గా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే.. చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే చంద్రుడిపై చంద్రయాన్-2 జ్ఞాపకాలను వదిలి వెళ్లిన ప్రాంతాన్ని తిరంగాగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. 


దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని మోదీ.. ఈ రోజు ఉదయం నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. హాల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రదాని.. ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించడానికి నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగళూరు వచ్చానని మోదీ అన్నారు. భారతదేశానికి ఇది సరికొత్త వేకువ అని ప్రధాని మోదీ కొనియాడారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ఉత్సాహపరిచారు. హాల్ విమానాశ్రయం నుంచి రోడ్ షోగా ఇస్రో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చంద్రయాన్-3 మిషన్ లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు. తొలుత చంద్రయాన్-3 బృందంతో ప్రధాని ఫోటోలు దిగారు. అనంతరం.. చంద్రయాన్-3 ప్రయోగంలో చేపట్టిన దశల గురించి ప్రధానికి ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడారు. భారత్ సత్తా ఏంటో ఈ రోజు ఇస్రో ప్రపంచానికి చూపించింది అని మోదీ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.


Also Read: Praggnanandhaa Mother: ప్రజ్ఞానందను చూస్తూ మురిసిపోయిన తల్లి, వైరల్ అవుతున్న పిక్‌పై ఆమె ఏమన్నారంటే?


ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రుడిపై కూడా భారత్ జెండా ఎగురుతోందని అన్నారు. ఇస్రో విజయం దేశానికే గర్వకారణమని, దేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచం అంతా కీర్తిస్తున్నట్లు కొనియాడారు. చంద్రయాన్-3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టిన స్థలాన్ని శివశక్తి స్థల్ గా నామకరణం చేశారు. చంద్రయాన్-2 దిగిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్ గా పేరు పెట్టారు.