న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం ఉదయం ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేశారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day 2025 ) పురస్కరించుకుని ఇక్కడి నుంచి ప్రధాని మోదీ వరుసగా 12వ సారి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రధాని మోదీ ఈ రోజు తన ప్రసంగంలో మాట్లాడుతూ, "స్వాతంత్ర్య దినోత్సవ వేడుక 140 కోట్ల ప్రజల తీర్మానాల పండుగ. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశ సత్తా చాటిన సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్" అని అన్నారు.

మేడ్ ఇన్ ఇండియా చిప్‌లను తీసుకొస్తాం..

"ఈ రోజు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం కోసం ఎంతో చేసిన మొదటి గొప్ప వ్యక్తి ఆయన. ఆర్టికల్ 370ని రద్దుచేసి ఒకే దేశం-ఒకే రాజ్యాంగం అనే సూత్రాన్ని మనం గ్రహించినప్పుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించాము. నేడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎవరినీ విమర్శించడానికి ఇక్కడికి రాలేదు. కానీ 4, 5 దశాబ్దాల కిందట దేశంలో సెమీకండక్టర్ల గురించి మాట్లాడుకున్నారు, కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు మనం ఆ పని చేశాం. దేశంలో 6 యూనిట్లను భూమిపై ప్రారంభిస్తున్నాము. ఈ సంవత్సరం చివరికి మేడ్ ఇన్ ఇండియా చిప్‌లను ప్రారంభిస్తాము"

"మన దేశం అనేక దశాబ్దాలుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాడుతోంది. భారతదేశం ఇకపై అణు బెదిరింపులను సహించేది లేదు. ఆపరేషన్ సిందూర్‌లో మీరు స్వావలంబన, మేడ్ ఇన్ ఇండియాను గమనించారు. ఈ ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. అవి శత్రువును క్షణంలో నాశనం చేయగలవు. మనకు సొంతంగా స్వావలంబన లేకుంటే, ఇతర దేశాలు మాకు మద్దతు ఇస్తారా లేదా అని ఆందోళన ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ అనేది ఉగ్రవాదంపై పోరాటానికి సూచన. ఏప్రిల్ 22 తర్వాత, మేము మా సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చాము. పాకిస్తాన్‌లో విధ్వంసం చాలా పెద్దది, 9 ఉగ్రవాద స్థావరాలు నాశనం చేయడం మామూలు విషయం కాదు. ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి, అందుకు సంబందించి కొత్త సమాచారం వస్తోంది" అని మోదీ అన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా నయా భారత్ థీమ్..

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 'నయా భారత్' అనే థీమ్‌తో జరుగుతున్నాయి. ఇది 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) విజయాన్ని హైలైట్ చేస్తున్నాయి. జ్ఞాన‌పథ్‌లో, వ్యూ కట్టర్‌లో ఆపరేషన్ చిహ్నం ఉంది. దాని థీమ్‌తో ప్రేరణ పొందిన ఫ్లవర్ ప్రజెంటేషన్‌ ప్రదర్శనలతో ఇది పూర్తి చేస్తారు.

ఎర్రకోటలో ప్రసంగించే ముందు, ప్రధాని మోదీ కూడా Xలో పోస్ట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'వికసిత్ భారత్' కోసం ఒక విజన్‌ను షేర్ చేసుకుంటూ ప్రధాని మోదీ ఇలా రాసుకొచ్చారు. "అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయడానికి, 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించడానికి మరింత కష్టపడి పనిచేయాలి. అమరవీరుల త్యాగాలు మనల్ని ప్రేరేపించాలని కోరుకుంటున్నాను. జై హింద్!" అని మోదీ పోస్ట్ చేశారు. 

 

ఫ్లయింగ్ ఆఫీసర్ రష్మిక శర్మ జాతీయ జెండాను ఎగురవేయడంలో ప్రధానమంత్రి మోదీకి సహాయం చేశారు. ఆ తర్వాత రెండు భారత వైమానిక దళం Mi-17 హెలికాప్టర్ల నుండి పూల వర్షం కురిపించారు. ఒకటి త్రివర్ణ పతాకాన్ని, మరొకటి ఆపరేషన్ సిందూర్‌ జెండాను ప్రదర్శించాయి. వింగ్ కమాండర్లు వినయ్ పూనియా, ఆదిత్య జైస్వాల్ ఈ విమానాలను నడిపారు.