Independence Day 2025: భారతదేశం 1947లో ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందింది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశం అభివృద్ధి వైపు అడుగులు వేసింది. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పాలన, ఆ తర్వాత పి.వి. నరసింహారావు కాలంలో సరళీకరణ, నేటి "న్యూ ఇండియా" విజన్ వరకు ప్రతి కీలకనేత పాలనలో భారత్‌కు స్వంత విధానాలు ఉన్నాయి. కొన్నిసార్లు సోషలిజానికి ప్రాధాన్యత ఇచ్చినా.. కొన్నిసార్లు పారిశ్రామికీకరణకు, అదే విధంగా దేశ ఆకలిని తీర్చడంలో కీలకపాత్ర పోషించిన హరిత విప్లవం  ఒక మైలురాయిగా నిలిచింది. 

1947 — స్వాతంత్ర్యం, దేశానికి కొత్త ప్రారంభం

తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలనలో భారత్ సమాజవాదం వైపు అడుగులు వేసింది. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ భారతావనికి పునాది వేశాయి. నేడు భారతదేశం ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మారడానికి ఆ సమయంలోనే బీజం పడింది. నెహ్రూ ప్రభుత్వ ఆలోచనల పాత్రను కొట్టిపారేయలేం.

స్వాతంత్ర్యం తరువాత కొన్ని దశాబ్దాలకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. విభజనతో పాటు పేదరికం పెరిగింది. అలాంటి పరిస్థితిలో, నెహ్రూ సోవియట్ యూనియన్ (USSR) నమూనాను అనుసరించి "మిశ్రమ ఆర్థిక వ్యవస్థ" విధానాన్ని స్వీకరించారు. ఇది స్వయం సమృద్ధితో పాటు వేగవంతమైన పారిశ్రామికీకరణపై ఫోకస్ చేసింది. ఇది భారతదేశాన్ని ఆకలి బాధల నుంచి బయటపడటానికి, విభజన బాధల నుంచి బయటపడేందుకు దోహదం చేసింది.

1950లు — నెహ్రూ పాలన, దేశానికి పునాది 

1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేశారు. దీని పని దేశం కోసం పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం, వాటిని అమలు చేయడం. మొదటి (1951–1956) పంచవర్ష ప్రణాళికలో నెహ్రూ ప్రభుత్వం వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. దీనివల్ల GDP వృద్ధి రేటు 3.2%కి చేరుకుంది. ఆ సమయంలో ఇది అంచనా వేసిన 2.1 శాతం కంటే చాలా ఎక్కువ. రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలు, ఉక్కు కర్మాగారాలు పెద్ద ఎత్తున ఉత్పత్తిపై దృష్టి సారించారు. SAIL, NTPC, BHEL వంటి PSU కంపెనీలు ఈ కాలంలోనే స్థాపించారు. వీటిని "ఆధునిక భారతదేశ దేవాలయాలు"గా పిలిచేవారు. వీటి లక్ష్యం లాభాలను ఆర్జించడమే కాదు, లక్షల మందికి ఉపాధి కల్పించడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడటం.

1960 - 1970 — హరిత విప్లవం, ఆహార స్వయం సమృద్ధి

1960వ దశకంలో భారతదేశం తీవ్రమైన కరువు సంక్షోభం ఎదుర్కొంది. విదేశీ ఆహార సహాయం కోసం చూసింది. ఆ సమయంలో వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ హరిత విప్లవం తీసుకొచ్చారు. అధిక ఉత్పత్తినిచ్చే గోధుమతో పాటు వరి వంగడాలను అభివృద్ధి చేశారు. ప్రభుత్వం ఎరువులు, పురుగుమందులు, నీటిపారుదల సంస్కరణలపై ఇన్వెస్ట్ చేసింది. దీనివల్ల భారతదేశ వ్యవసాయ విధానం మారిపోయింది. దేశంలో ఎంతో మంది ఆకలి తీర్చేందుకు కృషి చేసిన స్వామినాథన్ భారత హరిత విప్లవ పితామహుడు అయ్యారు.

1980లు — సాంకేతిక పరిజ్ఞానం ఆవిర్భావం

రాజీవ్ గాంధీ హయాంలో భారతదేశం క్రమంగా సోషలిజం నుంచి టెక్నాలజీ వైపు ఫోకస్ చేసింది. టెలికమ్యూనికేషన్, ITకి ప్రోత్సాహం లభించింది. గ్రామీణ ప్రాంతాలకు టెలిఫోన్‌లు వచ్చాయి.  MTNL పట్టణ సేవలలో మెరుగైంది. లైసెన్స్ లలో కూడా కొంత సడలింపు ఇచ్చి ప్రోత్సహించారు.

1991 — ఆర్థిక సరళీకరణలో పెద్ద ముందడుగు

1991లో భారతదేశంలో అసలైన ఆర్థిక సంస్కరణలు జరిగాయి. విదేశీ మారక నిల్వల సంక్షోభం, గల్ఫ్ యుద్ధం కారణంగా దేశం దాదాపు దివాలా తీసింది. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ "కొత్త ఆర్థిక విధానం"ను తీసుకొచ్చి దేశ దశ దిశను మార్చేశారు. విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కల్పించడంతో పాటు మార్కెట్ ఆధారిత సంస్కరణలు తీసుకొచ్చారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజే షన్ అనే ఎల్పీజీ విధానాలతో దేశాన్ని గాడిన పెట్టారు తెలుగుతేజం పీవీ నరసింహారావు. 

డిజిటల్ ఇండియా నుండి గ్లోబల్ హబ్‌ వరకు

నేడు TCS, Infosys వంటి కంపెనీలు మన దేశాన్ని ప్రపంచ ఐటీలో అవుట్‌సోర్సింగ్ హబ్‌గా మార్చాయి. 2025లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4.19 ట్రిలియన్ డాలర్లకు చేరింది. జపాన్‌ను అధిగమించిన భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.