SP MLA Pooja Pal thanks UP CM: అసెంబ్లీలో సీఎంను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పొగుడుతారు. విపక్ష ఎమ్మెల్యేలు విమర్శిస్తారు. అది కామన్. కానీ యూపీ అసెంబ్లీలో మాత్రం రివర్స్ లో జరిగింది. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను హీరోను చేసేశారు. 

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పూజా పాల్, తన భర్త రాజు పాల్ హత్యకు కారణమైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను ఎన్‌కౌంటర్ ద్వారా "అంతం చేసినందుకు" ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

 పూజా పాల్ ప్రయాగ్‌రాజ్‌లోని చైల్ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త రాజు పాల్ ను 2005లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య చేశారు.  ఈ హత్య తర్వాత, పూజా పాల్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తన భర్త స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతిక్ అహ్మద్, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్. 100కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటిలో రాజు పాల్ హత్య కేసు కూడా ఒకటి. 2023లో, అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్ ప్రయాగ్‌రాజ్‌లో ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.   

గురువారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో, పూజా పాల్ తన భర్త రాజు పాల్ హత్య కేసులో న్యాయం అందించినందుకు యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  నా భర్త హంతకుడిని ముఖ్యమంత్రి మట్టిలో కలిపారని కృతజ్ఞతలు తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌లోని అనేక మంది మహిళలకు న్యాయం అందించారని ప్రశంసించారు.  ప్రయాగరాజ్ మహిళల తరపున తాను మాట్లాడానని ఆమె అంటున్నారు. 

పూజా పాల్   వ్యాఖ్యలు సమాజ్‌వాదీ పార్టీకి షాక్ ఇచ్చాయి, ఎందుకంటే ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా ఉండి, బీజేపీ ముఖ్యమంత్రిని బహిరంగంగా పొగడటం పార్టీ విధానానికి విరుద్ధంగా  భావించారు. ఆమె వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.