Konaseema Latest News: ఓఎన్జీసీ అంటే భారీ యంత్రాలు, భారీ వాహనాలు, ఎత్తైన రిగ్‌లు.. భూమి నుంచి ఆయిల్ , గ్యాస్ తవ్వి తీస్తాయట.. అనేంతవరకు తెలుసు. కానీ కోనసీమ ప్రాంతంలో జరిగిన ఓ ఘటనతో నేటికి అక్కడి ప్రజలను భయకంపితులను చేస్తుంది. అంతవరకు అసలు పాశర్లపూడి అనే ఊరు ఎక్కడ ఉందో తెలియని వారికి సైతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీవినీ ఎరుగని భయాన్ని కోనసీమ ప్రాంత ప్రజలు ప్రత్యక్షంగా చవి చూశారు. ఓఎన్జీసీ పేరు చెబితేనే నేటికీ వణికిపోతారు. 80 దశకంలో పుట్టిన వారిని, పెద్దలను ఎవ్వరినైనా అడిగితే ఇట్టే కళ్లల్లో భయం కనిపిస్తుంది. నాడు పాశర్లపూడిలో జరిగిన దుర్ఘటన గురించి చెబుతారు. ఓఎన్జీసీ చాలా ఆపరేషన్లు నిర్వహించినప్పటికీ పాశర్లపూడి బ్లో అవుట్ మాత్రం ఓఎన్జీసీ చరిత్రలో అతిపెద్ద రెండో ప్రమాదంగా చెబుతారు.. అటువంటి సంచలనానికి కేంద్రంగా మారిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పాశర్లపూడిలో ఇప్పుడు మళ్లీ ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తుండగా గ్యాస్ నిక్షేపాల వెలికితీతలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది..
పాశర్లపూడిలో మళ్లీ ఉత్పత్తి దిశగా ఓఎన్జీసీ ప్రయత్నాలు..
కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఆన్‌షోర్ కార్యకలాపాలను ఓఎన్జీసీ మళ్లీ విస్తృతంగా నిర్వహిస్తోంది. గతంలో చేపట్టిన సిస్మిక్ సర్వేలో లభించిన సోర్స్ ఆధారంగా ఇందులో కొత్త ప్రాంతాల్లో చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీత కోసం రిగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పాశర్లపూడి ఓఎన్జీసీ క్షేత్రం శ్రీరామపేట సమీపంలో డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న బావిలో ఆశాజనకంగా సహజ వాయువుతో కూడిన చమురు నిక్షేపాలు లభ్యమయ్యాయి. దీంతో ఉత్పత్తి పరీక్షలకు పాసర్లపూడి సెక్టార్‌లో ఓఎన్జిసి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. గత నెల 9న డ్రిల్లింగ్ 2,860 మీటర్లకు చేరుకున్న చివరి సమయంలో ఒక్కసారిగా గ్యాస్ పైకి రావడంతో అప్రమత్తమైన సాంకేతిక సిబ్బంది గ్యాస్‌ను అదువు చేశారు. గ్యాస్ లీకేజీ అవ్వడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై నిరసనలు వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అమలాపురం ఆర్డీవో మాదవి, రెవెన్యూ అధికారులు సంబంధిత ఓఎన్జీసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..
కోనసీమ ప్రజల పీడకలగా పాశర్లపూడి బ్లో అవుట్..
1995 జనవరి 8న సాయంత్రం సుమారు 6:50 గంటల సమయం.. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో ఆకాశాన్ని తాకేలా అగ్ని జ్వాలలు సుమారు 100 మీటర్లు మేరకు పైకి ఎగదన్నాయి. చుట్టుపక్కల కొబ్బరి చెట్లన్నీ మాడి మసైపోయాయి. అక్కడున్నవారు ఏమయ్యారో తెలియదు. అసలు ఏం జరుగుతుందో, ఏం జరిగిందో తెలియదు. 50 కిలో మీటర్లు దూరం వరకు ఆకాశం ఎర్రగా మారింది. కాసేపటికి అధికారులు ద్వారా అసలు విషయం వెల్లడైంది. ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాల వెలికితీత ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా బ్లోఅవుట్ అయ్యిందని. బోడసకుర్రు గ్రామ పరిధిలో ఉండే ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)కు చెందిన ఈ పాశర్లపూడి గ్యాస్ వెల్ నంబర్ 19లో ఈ ప్రమాదం సంభవించిందని తెలిసింది.
పాసర్లపూడి బ్లో అవుట్ (Pasarlapudi Blowout) అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక ప్రధాన పారిశ్రామిక ప్రమాదంగా చెబుతుంటారు. నాటి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం సమీపంలోని పాసర్లపూడి గ్రామంలో చోటుచేసుకోగా సుమారు 62-65 రోజుల పాటు అగ్నకీలలు ఎగసిపడ్డాయి.బ్లో అవుట్ సంభవించిన తర్వాత మిగిలిన పైపులు గ్యాస్ బయటికి పంపేశాయి. డ్రిల్లింగ్ టవర్లు అగ్నిజ్వాలలకు మైనంలా కరిగిపోయాయి. చుట్టుపక్కల సామగ్రి నాశనమైంది. బ్లో అవుట్ వల్ల రోజుకు 1 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ బయటికి వెలువడింది. మంటలు 10 కి.మీ.దూరం నుంచి కనిపించాయి. భారీ శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. ఉష్ణోగ్రత 50°Cకు మించి పెరిగింది. సమీప గ్రామాల నుంచి సుమారు 6000 కుటుంబాలను ఖాళీ చేయించి రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. చివరకు 65 రోజుల అనంతరం విదేశీ నిపుణుల సహకారంతో మంటలను అదుపు చేసి గ్యాస్ ను కంట్రోల్ చేసి క్యాప్ ఏర్పాటు చేయగలిగారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ గ్యాస్ తీసే ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.