PM Kisan Yojana 21st Installment | కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Kisan Yojana) అతిపెద్దది. దీని కింద లబ్ధిదారులైన రైతులకు సంవత్సరానికి రూ. 6000 అందజేస్తారు. ఇది 2 వేల రూపాయల చొప్పున 3 వాయిదాలలో చెల్లిస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే 20 వాయిదాల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రైతులు ప్రస్తుతం 21వ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక సమాచారం అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేస్తారు. 21వ వాయిదా ఎప్పుడు విడుదలవుతుందో, అంతకుముందే రైతులు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం, తద్వారా మీ వాయిదాలో ఎలాంటి ఆటంకం కలగదు.
రైతులకు 21వ వాయిదా నగదు విడుదల
కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ యోజన 21వ వాయిదాకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19, 2025న రైతుల ఖాతాల్లో తదుపరి వాయిదాను విడుదల చేయనున్నారు. ఈసారి దాదాపు 9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అంటే వాయిదా కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. వారం రోజుల్లోపే రైతులకు రూ.2 వేలు రానున్నాయి.
కేంద్రం ఇప్పటికే వరద ప్రభావిత రాష్ట్రాల రైతులకు 21వ వాయిదా విడుదల చేసిందని తెలిసిందే. ఇందులో అక్టోబర్ 7, 2025న జమ్మూ కాశ్మీర్ రైతులకు 21వ వాయిదా లభించింది. అంతకుముందు సెప్టెంబర్ 26, 2025న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రైతులకు కూడా 21వ వాయిదా నగదు లభించింది.
రైతులు వెంటనే ఈ పని చేయాలి
PM కిసాన్ యోజన 21వ వాయిదా విడుదలయ్యే ముందు రైతులు కొన్ని పనులు పూర్తి చేయాలి. వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే, చాలా మంది రైతులు ఇప్పటికీ ఈ-కేవైసీ (E KYC) ప్రక్రియను పూర్తి చేయలేదు. అలాంటి రైతుల తాజా వాయిదా నగదు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేసుకోవాలని అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇటు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా, భూమి ధృవీకరణ కూడా పూర్తి చేసుకోవాలి. భూమికి సంబంధించిన రికార్డులలో ఏదైనా లోపం ఉన్న రైతులు, దానిని కూడా పత్రాల్లో సరిదిద్దుకోవడం ముఖ్యం. అలాగైతేనే 2 వేల రూపాయల వాయిదా మీ బ్యాంక్ ఖాతాలో ఎలాంటి ఆటంకం లేకుండా జమ అవుతుంది.