PM KISAN SAMMAN NIDHI | దేశంలో నేటికీ సగం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పేద, సన్నకారు రైతులు ఉన్నారు. ఇలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ రైతుల కోసం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2018లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలు పంట పెట్టుబడి సాయంగా ఇస్తారు.

దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందారు. ఈ పథకంలో ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం మొత్తం 19 విడతలు నగదు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ రైతులు 20వ వాయిదా పీఎం కిసాన్ స్కీమ్ నగదు కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నగదును ఎప్పుడు విడుదల చేస్తుందో వివరాలు అందిస్తున్నాం. ఈ పథకానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.  

PM Kisan 20వ విడత ఎప్పుడు విడుదల కానుంది

దేశంలోని కోట్లాది మంది లబ్ధిదారులైన రైతులు PM కిసాన్ యోజన స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకంలో ఇప్పటివరకు మొత్తం 19 వాయిదాలు రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ అయింది. ఇప్పుడు లబ్ధిదారులైన రైతులు 20వ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది త్వరలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల ఖాతాలో రూ.2 వేలు నగదు జమ చేస్తుందని తెలిసిందే. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 19వ వాయిదాను ఫిబ్రవరి 24, 2025న బీహార్‌లోని భాగల్‌పూర్‌ నుండి విడుదల చేశారు. 19వ విడత నగదు జమ అయినప్పటి  నుంచి ఇదివరకే నాలుగు నెలలు గడిచాయి. కనుక జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో పీఎం కిసాన్ 20వ విడత సాయం నగదు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అన్నదాతలు ప్రభుత్వం ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  

ఈ పనులు తప్పనిసరిగా పూర్తి చేయండి

మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) తదుపరి విడత నగదు పొందాలనుకుంటే, కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయండి. ముందుగా లబ్ధిదారులైన రైతులు మీ ఇ-కెవైసిని పూర్తి చేయండి. ఎందుకంటే ఈ కేవైసీ పూర్తి చేయని రైతుల బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయరు. దీనితో పాటు, ఆధార్ కార్డును బ్యాంకు అకౌంట్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది రైతులు ఈ రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేయకపోవడం వల్ల పీఎం కిసాన్ ప్రయోజనం పొందలేకపోతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇది పూర్తి చేసి లబ్ది పొందాలని అధికారులు, కేంద్రం రైతులకు సూచిస్తుంది.