Panch Pran Pledge: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేరీ మాటీ.. మేరా దేశ్(నా మట్టి.. నా దేశం) ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైంది. ఆగస్టు 30వ తేదీ వరకు సాగనుంది. నా దేశం.. నా మట్టి ప్రచార కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలో మొక్కలు నాటారు.


గురువారం (ఆగస్టు 17) ఒడిశాలోని పూరీలో పర్యటించిన కేంద్ర మంత్రులు.. మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేశారు. మేరీ మాటీ మేరా దేశ్ ప్రచార కార్యక్రమంపై ప్రముఖ సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ సిద్ధం చేసిన కళాఖండాన్ని నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ వీక్షించారు. నా మట్టి.. నా దేశం కార్యక్రమంలో భాగంగా పంచప్రాణ్ ప్రతిజ్ఞ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. విదేశీయుల బానిసత్వంలో మనలో నాటుకున్న మనస్తత్వాన్ని తొలగించడం చాలా అవసరమని పేర్కొన్నారు. అలా తొలగించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం మారుతుందని, ప్రపంచం గర్వపడేలా రూపొందుతుందని తెలిపారు. 


అంతకు ముందు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు.






Also Read: Chandrayaan-3: స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి విడిపోనున్న ల్యాండర్ విక్రమ్, నేడే కీలక దశ


అమర జవాన్లు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా మేరీ మాటీ మేరా దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరుతో అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మన్ కీ బాత్ లో దేశ ప్రజలను ఉద్దేశించి ఈ కార్యక్రమం గురించి మోదీ చెప్పుకొచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నారు.


దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతో పాటు మొక్కలు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు మోదీ వెల్లడించారు. ఆ పవిత్రమైన మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో అమృత్ వాటికను నిర్మించనున్నారు. ఆ అమృత్ వాటికలోనే మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఈ అమృత్ వాటిక ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ కు గొప్ప చిహ్నంలా నిలుస్తుందన్నారు. జులై 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ 103 ఎడిషన్ సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు.


దేశంలోని నలుమూలల నుంచి 7,500 కలశాల్లో మట్టిని.. అమృత కలశ యాత్ర పేరుతో ఢిల్లీకి తీసుకు వస్తారు. ఈ యాత్రలో భాగంగానే వివిధ ప్రాంతాల నుంచి రకరకాల మొక్కలను కూడా తీసుకెళ్తారు. మొత్తంగా 7,500 కలశాల మట్టితో, మొక్కలతో జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమృత వాటిక నిర్మిస్తారు. ఈ అమృత వాటిక  ఉద్యానవనం.. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కు చిహ్నంలా నిలుస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.