Physical Relation On False Promise Of Marriage: ఇటీవల కాలంలో సహజీవనం లాంటి పాశ్చ్యాత్య సంస్కృతి దేశంలో పెరిగిపోతోంది. దాంతో యుక్త వయసుకు రాగానే కొందరు యువత శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని వాగ్దానం చేయడంతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. చివరికి పెళ్లి చేసుకుంటే ఓకే, లేకపోతే తాము మోసపోయాం అంటూ పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ ఇది చట్టవిరుద్ధమైన నేరం.  తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడుతుంది. భారతీయ న్యాయ సంహిత విధానం ప్రకారం, వివాహ వాగ్దానం చేసి లేదా మోసపూరిత వాగ్దానం చేసి.. శారీరక సంబంధం ఏర్పరచుకుంటే ఎంత శిక్ష విధిస్తారు? చట్టం ఈ విషయంలో ఏమి చెబుతుంది? పూర్తి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం.. 

అబద్ధపు వాగ్దానంతో లైంగిక సంబంధాలు

ఒక వ్యక్తి ఎవరైనా యువతిని, మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి.. ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటున్నారు. తరువాత ఆమెకు బదులుగా వేరొకరిని వివాహం చేసుకునేందుకు యత్నించడం, ప్రేమించి మోసపోయిన యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం తరచుగా జరుగుతున్నాయి. అయితే వివాహం పేరుతో మాట ఇచ్చి, శారీరక అవసరాలు తీర్చుకుని పెళ్లి చేసుకోకుండా మోసం చేయడం అది చట్టప్రకారం నేరం. భారతీయ న్యాయ విధానం సెక్షన్ 69 ఈ కేసులో శిక్షను పడుతుందని తెలుపుతుంది. అయితే పరస్పరం కోరికలు తీర్చుకుని.. అత్యాచారం చేశాడంటూ దొంగ కేసులు పెట్టడం సైతం తగదని కోర్టులు యువతులు, మహిళల్ని హెచ్చరించిన తీర్పులు సైతం ఉన్నాయి.

ఇండియన్ పీనల్ కోడ్ (BNS) సెక్షన్ 69 ప్రకారం, ఎవరైనా వివాహ వాగ్దానం చేసి యువతులు, మహిళతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే, ఆ వ్యక్తిపై నేరం రుజువు అయితే.. తప్పు చేసిన వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో రెండు శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. 

ఈ కేసుల్లో కూడా శిక్ష పడుతుంది

భారతీయ న్యాయ సంహిత విధానం 2023 సెక్షన్ 69 ప్రకారం, వివాహ వాగ్దానం చేసి మాత్రమే లైంగిక సంబంధం ఏర్పరచుకోవడాన్ని శిక్షను నిర్వచించలేదు. ఈ సెక్షన్ ప్రకారం, ఓ వ్యక్తి ఎవరైనా యువతినిగానీ, మహిళలకు ఉద్యోగం, సహాయం లాంటి ఏదైనా ఆశ చూపించి శారీరక సంబంధం ఏర్పరచుకున్నా.. మోసం చేసినట్లు రుజువైతే శిక్ష విధించనున్నారు. అదే విధంగా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నా, గర్భవతిని చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసినట్లు రుజువైతే కోర్టులు దోషికి శిక్ష విధిస్తాయి. 

ఈ మధ్య కాలంలో సహజీవనం కల్చర్ పెరిగిపోతోంది. అడల్ట్ పీపుల్ తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తరువాత మోసం చేశారంటూ పోలీసులను, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని కేసులలో పూర్తి విచారణ చేపట్టిన అనంతరం కోర్టులు సంచలన తీర్పులు వెలువరించాయి. పరస్పరం లైంగిక సంబంధాలు ఏర్పరుచుకుని, చివరికి మోసంపోయాం అని ఎలా చెబుతారని సైతం కొందరు న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ప్రశ్నించిన కేసులు ఉన్నాయి. వివాహేతర సంబంధాల విషయంలోనూ భార్య, భర్తలు తమ భాగస్వామికి శిక్ష విధించాలని కోర్టులను కోరగా.. అది నైతికత, నమ్మకాన్ని పోగొట్టుకోవడం కిందకు వస్తుందని.. నేరం కిందకు వస్తుందని చెప్పలేమని సైతం తీర్పులు ఇచ్చిన ఘటనలు ఉన్నాయి.