Supreme Court: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడితే అందుకు ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. చేసిన తప్పులను, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను మాఫీ చేయడానికి క్షమాపణలు సరిపోవని వ్యాఖ్యానించింది. నటుడు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌పై కేసులో సుప్రీం కోర్టు ఈ వాఖ్యలు చేసింది. మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై విచారణను రద్దు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
2018లో ఎస్వీ శేఖర్ ఫేస్‌బుక్‌లో మహిళా జర్నలిస్ట్‌లపై అనుచిత పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై తమిళనాడు వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శేఖర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఎస్వీ శేఖర్ తప్పును గ్రహించిన తర్వాత పోస్ట్‌ను తొలగించారని, బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారని వివరించారు. ఆయన దృష్టి మసకబారిందని, వేరొకరి పోస్ట్‌ను అనుకోకుండా, చదవకుండా చేసారని కోర్టుకు వివరించారు.
పొరపాటు జరిగింది.. క్షమించండి
సోషల్ మీడియాలో ఎస్వీ శేఖర్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని, ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్‌గా మారిందని ఆయన తరపు న్యాయవాది వివరించారు. ఆయన గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చారని, ఆయన కుటుంబం మహిళా జర్నలిస్టులను గౌరవిస్తుందన్నారు. తాను పోస్ట్ షేర్ చేసే సమయంలో ఆయన కంటి మందు వేసుకుని ఉన్నారని, ఆ కారణంగా పోస్ట్ చేశారని, పోస్ట్‌లోని విషయాలను చదవలేకపోయారని న్యాయస్థానానికి వివరించారు.
ఎస్వీ శేఖర్ తరఫున వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విషయం చదవుకుండా పోస్ట్‌ను ఎలా షేర్ చేశారంటూ ప్రశ్నించింది. అతనిపై విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ విషయంపై ధర్మాసనం స్పందిస్తూ.. "సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధతో ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించడం అవసరం లేదు, కానీ ఎవరైనా దానిని ఉపయోగిస్తే, దాని కారణంగా జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి," అని వ్యాఖ్యానించింది.
2018లో మహిళా జర్నలిస్ట్‌లను కించపరుస్తూ ఎస్వీ శేఖర్ పోస్ట్ చేశారు. అది వివాదానికి కారణమైంది. చెన్నై, కరూర్, తిరునెల్వేలి జిల్లాల కోర్టుల్లో జర్నలిస్టుల సంఘం క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలనే ఎస్వీ శేఖర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతారహిత్యం తగదని వ్యాఖ్యానించింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన, ఫార్వార్డ్ చేసిన పోస్ట్, సందేశం విల్లు నుంచి ఎక్కుపెట్టి వదిలిన బాణం లాంటిదని వ్యాఖ్యానించింది. పోస్ట్ చేసిన వారి వద్ద ఉండే వరకు, అది అతని నియంత్రణలో ఉంటుందని. అది పంపిన తర్వాత దాని వల్ల కలిగే కలిగే నష్టానికి, సంబంధించిన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఒకసారి నష్టం జరిగితే, క్షమాపణ కోరినా దాన్ని నుంచి బయటపడటం చాలా కష్టమని అభిప్రాయపడింది. ఎస్వీ శేఖర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని శేఖర్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే సుప్రీం కోర్టు వారి అభ్యర్థనను తిరష్కరించింది. క్షమాపణలు క్రిమినల్ ప్రొసీజర్స్‌ను ఆపలేవని వ్యాఖ్యానిందింది. ట్రయల్ కోర్టు జడ్జిని సంప్రదించాలని సూచించింది.