Trichy Airport: 


తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో..


తిరుచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు ఊహించిన అనుభవం ఎదురైంది. ఓ ప్యాసింజర్ తన ట్రాలీ బ్యాగ్‌లో 47 పాముల్ని, రెండు బల్లుల్ని ప్యాకింగ్ చేసి పట్టుకొచ్చాడు. కౌలా లంపూర్‌ నుంచి వచ్చిన ఆ ప్యాసింజర్ బ్యాగ్‌ని కస్టమ్స్ అధికారులు చెక్‌ చేయగా ఇది బయట పడింది. వెంటనే ఆ ప్రయాణికుడుని అరెస్ట్ చేశారు. ఐడీ కార్డుల ఆధారంగా నిందితుడిని మహమ్మద్ మొయిద్దీన్‌గా గుర్తించారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగీ దిగగానే కస్టమ్స్ అధికారులు ఆయన ట్రాలీ బ్యాగ్‌ని చూసి అనుమానపడ్డారు. వెంటనే బ్యాగ్‌ని తెరిచి చూసి షాక్ అయ్యారు. అటవీ అధికారులు అందులోని పాముల్ని, బల్లుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి మలేషియాకు పంపుతామని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. 


అమెరికాలోనూ...


అమెరికాలోని ఓ ఎయిర్‌ పోర్ట్‌లో చెక్‌ ఇన్‌ వద్ద ఓ మహిళ బ్యాగ్‌ను తనిఖీ చేసిన అధికారులు షాక్ అయ్యారు. తన క్యారీబ్యాగ్‌లో పాముని పట్టుకొచ్చింది. ఫ్లైట్‌తో తనతో పాటు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ...అధికారుల చెకింగ్‌తో అందుకు బ్రేక్ పడింది. అమెరికాలోని టంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. ఆమె క్యారీబ్యాగ్‌లో నాలుగు అడుగుల పాముని గుర్తించారు. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ 
సిబ్బంది ఆ బ్యాగ్ స్కానింగ్ ఫోటోను కూడా షేర్ చేశాయి. అందులో చాలా స్పష్టంగా పాము కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. షూ, ల్యాప్‌టాప్‌తో పాటు పాము అందులో కనిపించింది. అయితే...ఈ ఘటన గతేడాది డిసెంబర్‌ 15న జరిగినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ కూడా పెట్టింది. "ఈ బ్యాగ్‌లో ప్రమాదకరమైన పాము ఉంది. ఎక్స్‌రే మెషీన్‌తో స్కాన్‌ చేసినప్పుడు ఇది తెలిసింది" అని తెలిపింది. ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌కు పెట్స్‌ను తీసుకొచ్చే విషయంలో నియమ నిబంధనలు మరోసారి గుర్తు చేసుకోవాలని సూచించింది.


అనుమతి లేదు..


సాధారణంగా ఏ ఎయిర్‌లైన్స్ కూడా పాముల్ని క్యారీ చేయడానికి అంగీకరించదు. సరైన విధంగా ప్యాకింగ్ చేస్తే కానీ అనుమతించదు" అని స్పష్టం చేసింది. అయితే...ఈ ఘటనపై మహిళ స్పందించింది. ఇది తనకెంతో ఇష్టమైన పెట్‌ అని అందుకే తీసుకొచ్చానని వివరించింది. ఆమె తీసుకొచ్చిన పాము Boa Constrictor అని, విషపూరితం కాకపోయినా అవి హాని చేస్తాయని అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) కార్గోలో పాము కనిపించడం కలకలం రేపింది. కాలికట్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఫ్లైట్‌లోని కార్గోలో సిబ్బందికి పాము కనిపించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాక...కార్గోలో పాము కనిపించడం వల్ల సిబ్బంది కాస్త కంగారు పడ్డారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపిన తరవాత అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయం తెలియజేశారు.


Also Read: జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో కాల్పులు- ఒక ఏఎస్‌ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి