Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో 8 ముఖ్యమైన బిల్లులను కేంద్రం సభలలో ప్రవేశపెట్టనుంది. దాదాపు 21 రోజుల జరగనున్న ఈ సమావేశాలలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యలపై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదం సైతం సభలో చర్చకు రానుంది.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాలలో భాగంగా కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేయనున్నారు. ఈ బిల్లు గత సమావేశంలో ప్రవేశపెట్టారు. తరువాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో పార్లమెంటుకు కొత్త బిల్లు 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సమస్యలను పరిష్కరిస్తుంది అన్నారు. సామాన్యులకు ఈ ట్యాక్స్ బిల్లు అర్థం చేసుకోవడం సులభం కానుందన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందితే ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తుంది.

ఐటీఆర్ నిబంధనలు మారనున్నాయి ప్రస్తుత ‘ఆర్థిక సంవత్సరం’ (FY), ‘అకౌంటింగ్ సంవత్సరం’ (AY) వ్యవస్థను భర్తీ చేసే టాక్స్ ఇయర్ అనే ప్లాన్ తీసుకొచ్చారు. ఉదాహరణకు, ప్రస్తుత నిబంధనల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయంపై 2024-25 సంవత్సరంలో పన్ను చెల్లిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, ఏ సంవత్సరంలో ఆదాయం వస్తుందో, అదే ఏడాది పన్ను కూడా చెల్లించాలి.

దాంతో పాటు కొత్త పన్ను బిల్లులో పాత, సంబంధం లేని నిబంధనలు, ‘ఫ్రింజ్ బెనిఫిట్ టాక్స్’కి సంబంధించిన భాగాలను తొలగించాలని ప్రతిపాదనలున్నాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లో రూపొందించారు. 1962లో అమలులోకి వచ్చింది. చాలా సవరణలు, మార్పులు చేర్పుల తర్వాత ఎవరికి అర్థం కానట్లుగా మారింది. కొత్త ట్యాక్స్ బిల్లు పన్నులను సరళీకృతం చేయడానికి దోహదం చేస్తుందని కేంద్రం చెబుతోంది.

 నేషనల్ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లుఈ సమావేశంలో ట్యాక్స్ బిల్లుతో పాటు నేషనల్ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లు, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (ఖనిజాలు మరియు గనులు) సవరణ బిల్లు ఉన్నాయి. ‘ఇండియన్ పోర్ట్స్ బిల్లు’ (భారతీయ ఓడరేవుల బిల్లు)తో సహా మొత్తం 8 పెండింగ్ బిల్లులను ఆమోదించడానికి కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. దాదాపు ఒక నెల రోజులపాటు 21 రోజులు సెషన్స్ జరగనున్నాయి.