Seema Haider Welcomes CAA: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. పశిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఇతర ప్రతిపక్ష నేతలు వ్యతిరేకించారు. ఈ అంశంపై భారత్ లోకి అక్రమంగా చొరబడిన పాక్ మహిళ సీమా హైదర్ (Seema Haider) స్పందించారు. సీఏఏ అమలును స్వాగతిస్తున్నానని.. ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రశంసలు జల్లు కురిపించారు. 'భారత ప్రభుత్వం ఈ రోజు నుంచి మన దేశంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేసింది. సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. ఈ చట్టంతో మేం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నాకు భారత పౌరసత్వం వచ్చేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని బలంగా నమ్ముతున్నా.' అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.






కాగా, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) - 2019ని లోక్‌సభ ఎన్నికలకు ముందు సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివాదాస్పద చట్టం ఆమోదించిన నాలుగు సంవత్సరాల తర్వాత, డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లింయేతరులకు మన దేశ పౌరసత్వం మంజూరు చేయడానికి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు. భారత్‌లో 11  ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఓ నిబంధన ఉంది. దాన్ని పూర్తిగా సవరించింది మోదీ సర్కార్. గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్‌లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే..ఇందులో గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో ఉండడం వల్ల అసోంలోని కర్బీ అంగ్‌లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చమ్‌కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది. అయితే దీనికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


సీమా హైదర్ కు వర్తిస్తుందా.?


ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో నివసిస్తున్న సీమా హైదర్‌కి భారత పౌరసత్వం ఇస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ చట్టం ప్రకారం, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి డిసెంబర్ 31, 2014 కంటే ముందు వచ్చిన ముస్లిమేతరులు పౌరసత్వం పొందగలరు. అయితే సీమా హైదర్ 2023లో అక్రమంగా భారత్‌కు వచ్చారు. నలుగురు పిల్లలతో కలిసి నోయిడాలోని ఓ వ్యక్తితో ఉంటున్నారు. అయితే, చట్టం నిబంధనల ప్రకారం ఆమెకు సీఏఏ వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. 


Also Read: CAA: సీఏఏ అమలు - కేంద్రంపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర అసహనం, ఫస్ట్ రియాక్షనే పీక్స్