జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు చుట్టుముట్టీ మరి కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు మరణించారు. సాధారణ ఉగ్రదాడి కాదని గ్రహించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకుని ఢిల్లీకి వచ్చారు. మంగళవారం రాత్రి సౌదీ నుంచి తిరుగు ప్రయాణమైన మోదీ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగశాఖ మంత్రి జయ శంకర్ సహా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై వారిని ప్రధాని మోదీ ఆరాతీశారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

ఉగ్రదాడితో పర్యటన మధ్యలోనే ముగించుకుని..

ప్రధానమంత్రి మంగళవారం రెండు రోజుల సందర్శనకు సౌదీ అరేబియా వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం రాత్రి తిరుగు ప్రయాణం కావాలి. కానీ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి తీవ్రత పెరిగిందని తెలుసుకున్న ఆయన టూరిస్టుల మరణంపై విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ సౌదీలో ఇచ్చిన ఇచ్చిన అధికారిక విందుకు హాజరు కాకుండానే మంగళవారం రాత్రి భారత్‌కు బయలుదేరారు.

సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో తన సమావేశంలో, రక్షణపై, రెండు కొత్త మంత్రిత్వ శాఖ కమిటీలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. భారతదేశంలో రెండు శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయడంలో సహకరించడానికి ఒప్పందం చేసుకున్నారు. అంతరిక్షం, ఆరోగ్యం, డోపింగ్ నిరోధక వ్యవస్థ, పోస్టల్ సహకారం రంగాలలో నాలుగు అవగాహన ఒప్పందాలపై ఇరువురు సంతకం చేశారు.

రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి లక్ష్యంగా సమావేశం అయ్యారు. కానీ జమ్మూకాశ్మీర్ అనంత నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి గురించి తెలియగానే  ఇద్దరు నేతలు ఉగ్రదాడిని ఖండించారు. కశ్మీర్‌లోని పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధానమంత్రి మోడీ క్రౌన్ ప్రిన్స్‌తో తన సమావేశాన్ని కనీసం రెండు గంటలు వాయిదా వేశారు.

పహల్గాంలో ఉగ్రదాడి

ఉగ్రవాదులు మంగళవారం కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని కాల్పులు జరిపి 26 మందిని చంపారు, వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. 2019లో పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లోయలో ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రదాడి. మృతులలో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ ఉగ్రదాడిపై Xలో ఒక పోస్ట్‌ చేశారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు. వారి అజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదంతో పోరాడాలనే మన సంకల్పం కొనసాగుతోంది. ఉగ్రమూకలపై పోరాటం మరింత పెంచుతాం అన్న ప్రధాని మోదీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేశారు.

"గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తామన్నారు. దాడి తర్వాత హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి, పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. 

ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఒకరు, తెలంగాణలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి సైతం ప్రాణాలు కోల్పోయారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్ లో ఐబీ అధికారి సైతం ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.