Doctors Letter To PM Modi: న్యూఢిల్లీ: కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రెయినీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా, దారుణ ఘటనను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. కోల్‌కత్తా డాక్టర్ అత్యాచార ఘటనపై పద్మ అవార్డు గ్రహీతలైన 71 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. హత్యకు గురైన మహిళా డాక్టర్ కుటుంబానికి సంఘీభావం ప్రకటించిన పద్మశ్రీ డాక్టర్లు.. తమ రక్షణకు చర్యలు సూచించారు. వైద్యారోగ్య రంగంలో సేవలు అందిస్తున్న సిబ్బంది రక్షణపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో కొన్ని విషయాలపై డాక్టర్లు డిమాండ్లు చేశారు. 


డాక్టర్ల 5 ప్రధాన డిమాండ్లు ఇవే..
1) డాక్టర్ల రక్షణ కోసం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలి
2) లైంగిక దాడులు, నేరాలకు పాల్పడేవారిని కఠినంగా మరియు నిర్ణీత కాలవ్యవధిలోగా శిక్షించేలా చర్యలు
3) ఆస్పత్రులు, వైద్యారోగ్య సంస్థల్లో హెల్త్‌కేర్ సిబ్బంది రక్షణకు మరింత మెరుగైన భద్రతా చర్యలు
4) హెల్త్‌కేర్ నిపుణులు, సిబ్బంది రక్షణ కోసం పటిష్టమైన సరికొత్త చట్టం తీసుకురావాలి
5) కొత్త చట్టంలో వైద్యులపై దాడులకు పాల్పడేవారిపై కఠినమైన శిక్షలు ఉండేలా చూడాలి