Kolkata Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20వ తేదీన విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుని విచారించనుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఇప్పటికే ఈ కేసుపై విచారణ జరిపిన కోల్‌కత్తా హైకోర్టు కేసుని సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి విచారణ వేగవంతమైంది. సీబీఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్‌ని విచారిస్తున్నారు. తోటి డాక్టర్‌లు, హాస్పిటల్‌ సిబ్బందితోనూ విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 30 మందికిపైగా పేర్లని నివేదికలో చేర్చినట్టు తెలుస్తోంది. దోషులకు కఠిన శిక్ష పడాలని ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీ చేపట్టారు. 






ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లోని ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. సెమినార్ హాల్‌లో అర్ధనగ్నంగా ఆమె డెడ్‌బాడీ కనిపించి సిబ్బంది షాక్ అయింది. దాదాపు 36 గంటల పాటు పని చేసిన బాధితురాలు ఇలా శవమై కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. శరీరమంతా గాయాలయ్యాయి. ప్రైవేట్ పార్ట్స్‌ నుంచి రక్తస్రావమైనట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వెల్లడించింది. మెడ విరిగిపోయింది. అత్యంత దారుణంగా హింసించి చంపినట్టు తేలింది. ఈ కేసులో ఓ వాలంటీర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్లూటూత్‌ హెడ్‌సెట్ ఆధారంగా ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. సామూహిక అత్యాచారం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే..పోలీసులు మాత్రం కొట్టి పారేస్తున్నారు.