Oyo founder Ritesh Agarwal's father Ramesh Agarwal death: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ శుక్రవారం గురుగ్రామ్‌లోని ఓ ఎత్తైన భవనంపై నుంచి పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో రమేష్ అగర్వాల్ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో రమేష్ అగర్వాల్ భవనంలోని 20 వ అంతస్తు నుండి పడిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన చనిపోయారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ ఈస్ట్ డీసీపీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి నోట్ తమకు లభ్యం కాలేదన్నారు.


ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహం మార్చి 7న అంగరంగ వైభవంగా ఢిల్లీలో జరిగింది. గీతాన్షా సూద్‌ను రితేష్ వివాహం చేసుకున్నారు. రితేష్ అగర్వాల్ రిసెప్షన్‌కు సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసోయోషి సన్ హాజరయ్యారు. నూతన జంట రితేష్, గీతాన్షాలను మసోయోషి సన్ ఆశీర్వదించారు. కానీ మూడు రోజుల వ్యవధిలో శుభకార్యం జరిగిన ఇంట్లోనే విషాదం జరిగింది. రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోయారు.






జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ ప్రకారం.. గురుగ్రామ్ లోని సెక్టార్ 54లోని డీఎల్ఎఫ్ కు చెందిన క్రెస్ట్ సొసైటీలో ఓయో ఫౌండర్ రితేష్ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ భవనంలోని 20వ అంతస్తు నుంచి పడిపోయారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు రమేష్ ను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్రరక్తస్త్రావం కావడంతో ఆయన మరణించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని రితేష్ కుటుంబానికి డాక్టర్లు అప్పగించారు. రమేష్ అగర్వాల్ కింద పడిపోయిన సమయంలో కుమారుడు రితేష్, కోడలు గీతాన్షా ఇంట్లో ఉన్నారు. 


గురుగ్రామ్ ఈస్ట్ DCP విజేందర్ విజ్ ఒక ప్రకటనలో రమేష్ అగర్వాల్ సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 174 CrPC సెక్షన్ కింద వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది బాధాకరమైన ఘటన అన్నారు.


ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఏమన్నారంటే.. మా నాన్న మరణం కుటుంబానికి తీరని లోటు. ఇది బాధాకరమైన విషయం. కష్టకాలంలో మా నాన్న ప్రేమ, ఆలోచనలు తమను ముందుకు తీసుకెళ్లాయన్నారు. ఈ కష్ట సమయంలో కొంచెం ప్రైవసీ కావాలని కోరుతున్నామని ఓ ప్రకటనలో కోరారు. 


మార్చి 7న ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన ఓయో వ్యవస్థాపకుడు రితేష్ వివాహానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.