Delhi Schools Bomb Threat: ఢిల్లీలోని దాదాపు 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. సోమవారం (డిసెంబర్ 9) ఉదయం 7 గంటలకు ఈమెయిల్స్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌కెపురంలోని డిపిఎస్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా స్కూల్, మదర్ మేరీ స్కూల్‌తో సహా 40 పాఠశాలకు ఈ మెయిల్స్ వచ్చాయి. చాలా స్కూల్స్‌లో అప్పటికే పిల్లలు, సిబ్బంది చేరుకున్నారు.  


మెయిల్స్ గురించి తెలుసుకున్న యాజమాన్యం ముందు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. అప్పటికే చేరుకున్న పిల్లల్ని ఇంటికి పంపేశారు. తర్వాత విషయాన్ని పోలీసులకు చేరవేశారు. బాంబు బెదిరింపు వచ్చిందని తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ, బాంబుస్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. 


ఈ మధ్య కాలంలో ఢిల్లీలోని పాఠశాలలు, విమానాశ్రయం, హోటళ్లు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌కు కొన్ని రోజుల క్రితం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ బృందం విచారణ చేపట్టింది. పాఠశాల క్యాంపస్‌లో తనిఖీలు చేపట్టి అది ఫేక్ కాల్‌గా తేల్చింది.  


ఢిల్లీలో పేలుళ్లు 
రోహిణి స్కూల్‌కు బెదిరింపు రావడానికి ఒక రోజు ముందు, ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు జరిగింది. తీవ్రత తక్కువే అయినా ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. చిన్నపాటి పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పొగలు వ్యాపించాయి. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  


గతంలో ఢిల్లీలోని రోహిణిలోని సీఆర్పీఎఫ్ స్కూల్ సమీపంలో కూడా పేలుడు చోటు చేసుకుంది. ఢిల్లీలో రెండు నెలల్లోనే ఇలాంటి రెండు పేలుళ్లు జరగడంతో ఇక్కడి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో శాంతిభద్రతలు ఇంత అధ్వాన్నంగా ఉండడం ఢిల్లీ వాసులు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. అమిత్ షా వచ్చి ఢిల్లీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


అంతే కాకుండా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, విమానాలకు నిత్యం బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తీర అన్ని తనిఖీలు చేసిన తర్వాత అది అబద్ధమని తేలుతోంది. అలాగని వచ్చిన బెదిరింపులను లైట్ తీసుకనే పరిస్థితి లేదని అంటున్నారు అధికారులు. ఇప్పుడు కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన ప్రతి స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు.