న్యూఢిల్లీ: జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా, మణిపూర్‌లో చెలరేగిన జాతి హింసపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. కొందరు సభ్యులతో ఉన్న గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో మొదటి రోజు నుంచి లోక్ సభ, రాజ్యసభలో సమావేశం ప్రారంభం అయిన కొంత సమయానికే మరుసటి రోజుకు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రకటన చేయకపోవడంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
విపక్షాలకు మెజార్టీ లేకున్నా ముందుకే!
లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543 . ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ బలం 272. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి 300లకుపైగా సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా ఏం చేసినా సరే వారి అవిశ్వాసం కచ్చితంగా వీగిపోతుంది. మంత్రిమండలిపై ప్రవేశపెట్టే ఈ అవిశ్వాస తీర్మానానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రతిపక్షాలు ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. ఒకవేళ తీర్మానానికి స్పీకర్ అనుమతినిస్తే, 10 రోజుల్లోగా స్పీకర్ నిర్ణయించిన తేదీల్లో చర్చ జరగాలి. తరువాత ఓటింగ్ జరిగి, ప్రభుత్వం కనుక ఓడిపోతే వెంటనే మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. ప్రభుత్వం కూలిపోయిందంటారు. అవిశ్వాసంపై స్పీకర్ అనుమతి జరిగితే.. చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా గొంతు విప్పవచ్చు అనేది ఇండియా కూటమి ప్లాన్ గా కనిపిస్తోంది. దేశంలో 2018లో చివరిసారిగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టగా.. ఏన్డీఏ కూటమికి 320కి పైగా ఓట్లు రాగా, విపక్షాల తీర్మానానికి కేవలం 126 సభ్యులు మద్దతిచ్చారు.
మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో రూల్ 193 కింద మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు నోటీసులు ఇచ్చాయి.కాగా, రాజ్యసభలో ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చించేందుకు రూల్ 176, రూల్ 267 కింద నోటీసులు ఇచ్చాయి. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రెండోరోజు సమావేశాలలో చర్చ జరగాలని విపక్షాలు నినాదాలు చేయగా.. లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలు సీరియస్‌గా లేవని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యతో దేశం సిగ్గుతో తల దించుకునేలా ఉందన్నారు.
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని వర్షాకాల సమావేశాలు 3వ రోజు (సోమవారం) సైతం విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్దంగా ఉన్నా, విపక్ష పార్టీలు సహకరించడం లేదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్షాలు నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం సైతం వాయిదా పడ్డాయి. రాజ్యసభలో చైర్మన్ ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆప్ నేత సంజయ్ సింగ్‌ను ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. ఇదే రోజు మూడు బిల్లులు - నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, 2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు, 2023 మరియు రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023లను సభలో ప్రవేశపెట్టారు.
ప్రతిపక్ష పార్టీ సభ్యుల నినాదాల మధ్య మంగళవారం బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు, 2022ను లోక్‌సభ ఆమోదించింది. మణిపూర్ అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నాన, విపక్షాలు సహకరించడం లేదని అమిత్ షా అంటున్నారు. ఎంత పోరాడినా ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేయకపోవడంతో.. పార్లమెంట్‌లోని రాజ్యసభ లో మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో విపక్ష నేతలు సమావేశమై అవిశ్వాస తీర్మానానికి నిర్ణయించుకున్నట్లు ఏబీపీ న్యూస్ కు ఓ నేత తెలిపారు.
మొరార్జీదేశాయ్... అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మొదటి ప్రధానిగా నిలిచారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని కూడా ఆయనే. 1979 జులై 16న జరిగిన తీర్మానంలో ఓటమిపాలై రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానంలో చివరగా ఓడింది అటల్ బిహారి వాజ్‌పేయ్. 1999లో తీర్మానంలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోయింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial