Onion Prices: 


తగ్గుతున్న ఉల్లి ధరలు..


దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు తగ్గించేందుకు ఇటీవలే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. ఈ కారణంగా ఎగుమతులు తగ్గిపోయాయి. ఫలితంగా...ఇప్పుడిప్పుడే ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ ధర కిలో రూ.20 కన్నా తక్కువగానే ఉంది. డిమాండ్‌కి తగ్గట్టుగా ఉల్లిగడ్డలు అందుబాటులో ఉన్నాయి. టమాటా తరవాత ఉల్లి ధరలు సామాన్యులను భయపెట్టాయి. పలు చోట్ల కిలో రూ.27కి విక్రయిస్తున్నారు. దేశీయంగా ధరలు తగ్గించేందుకు కేంద్రం ఉల్లి ఎగుమతులపై 40% సుంకం విధించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం...కేంద్ర ప్రభుత్వం హోల్‌సేల్ బఫర్ స్టాక్ నుంచి 36,250 టన్నుల ఉల్లిగడ్డలను మార్కెట్‌లోకి పంపింది. దాదాపు 12 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మార్కెట్‌లకు తరలించింది. NAFED,NCCF ఈ బాధ్యత తీసుకున్నాయి. ఈ రెండు సంస్థలు రైతుల నుంచి దాదాపు 3-5 లక్షల టన్నుల ఉల్లిగడ్డల్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగా...బఫర్ స్టాక్‌ భారీగా ఉండకుండా చూసుకోనుంది. ఆగస్టు 11 నుంచి దాదాపు 35,250 టన్నుల ఉల్లిగడ్డల్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అసోం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఛండీగఢ్, కేరళలోని మార్కెట్‌లోకి పంపారు. 


ఇటీవల టమాటా ధరల పెంపును గమనించిన ప్రభుత్వం ఉల్లిపాయల విషయంలో జాగ్రత్త పడింది. ఎగుమతి సుంకం పెంపుతో దేశంలో ఉల్లి సరఫరా పెరిగితే, ధరలు అదుపులో ఉంటాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు ఉల్లి ధరల నుంచి ఊరట కలగనుంది. ఎగుమతులు అధికం కావడం, దేశంలో సరఫరా తగ్గిపోతే ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో ఉల్లి ధరల పెరుగుదల ఉంటుందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. ఇటీవల బియ్యం ధరలను నియంత్రించడంలో భాగంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించడం తెలిసిందే. ఈ నిషేధం అమెరికా లాంటి దేశాల్లో ప్రభావం చూపింది. ఉల్లి ధర కొన్ని వారాలుగా పెరుగుతూ వస్తోంది. ఆగస్టు చివరి నాటికి రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. తక్కువ సమయంలో ఉల్లిపాయ కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని పీటీఐ గత వారం రిపోర్ట్ చేసింది. 


Also Read: ఓసారి రాజ్యాంగం చదవండి, అందులో "భారత్‌" కనిపిస్తుంది - విపక్షాలకు జైశంకర్ కౌంటర్