చంద్రుడిపైకి భారతదేశం సగర్వంగా పంపించిన చంద్రయాన్ 3 ల్యాంకర్ విక్రమ్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ల్యూనార్ రీకన్నైసెన్స్ ఆర్బిటార్(LRO) స్పేస్‌క్రాఫ్ట్ ఫొటో తీసింది. ఆగస్టు 27న తమ ఎల్‌ఆర్‌ఓ విక్రమ్ ల్యాండర్‌ను ఫొటో తీసినట్లు నాసా వెల్లడించింది. ఆ ఫొటోను సోషల్‌మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్ 3 ల్యాండర్‌ను ఎల్‌ఆర్‌ఓ ఇటీవల ఫొటో తీసిందని నాసా పేర్కొంది.
ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై తిరుగుతూ ఎన్నో కీలకమైన అంశాలను తెలియజేసింది. అయితే నాసా ఎల్‌ఆర్‌ఓ విక్రమ్ చంద్రుడిపై ల్యాండ్ అయిన నాలుగు రోజుల తర్వాత ఫొటోను తీసింది. నాసా తెలిపిన వివరాల ప్రకారం విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు రోజుల తర్వాత తమ ఎల్‌ఆర్‌ఓ స్పేస్‌క్రాఫ్ట్ 42 డిగ్రీల ఏటవాలు కోణంలో తీసినట్లు పేర్కొంది. నాసాకు చెందిన ఈ ఎల్‌ఆర్‌ఓను మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నాసా గోడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మేనేజ్ చేస్తుంది. వాషింగ్టన్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో సైన్స్ మిషన్ డైరెక్టరేట్ కోసం ఇది పనిచేస్తుంది.
ఇస్రో ఇటీవల చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్న ల్యాండర్ విక్రమ్ అద్భుతమైన 3డీ చిత్రాన్ని పంచుకుంది. అనాగ్లిఫ్ (Anaglyph) టెక్నిక్‌ని ఉపయోగించి చిత్రాన్ని రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. అనాగ్లిఫ్ అనేది స్టీరియో లేదా మల్టీ-వ్యూ ఇమేజెస్ నుంచి త్రీ డైమెన్షన్స్ లో తీసిన సింపుల్ విజువలైజేషన్ అని ఇస్రో వివరించింది. ‘‘ఇక్కడ చూపిస్తున్న అనాగ్లిఫ్ (ఫోటో) నావ్‌క్యామ్ స్టీరియో ఇమేజెస్ (NavCam Stereo Images) వాడి క్రియేట్ చేశారు. ఇందులో ప్రజ్ఞాన్ రోవర్ క్యాప్చర్ చేసిన ఎడమ, కుడి ఇమేజెస్ రెండూ ఉన్నాయి. స్పేస్ ఏజెన్సీ ఈ 3-ఛానల్ ఇమేజ్‌లో ఎడమ ఇమేజ్ ఎరుపు ఛానెల్‌లో ప్లేస్ చేసి ఉందని, కుడి ఫోటో బ్లూ, గ్రీన్ ఛానెల్స్ (సియాన్ కలర్ క్రియేట్ చేయడం) లో ప్లేస్ చేసి ఉంది. ఈ రెండు ఫోటోల మధ్య దృక్కోణంలో డిఫరెన్స్ స్టీరియో ఎఫెక్ట్‌కు దారి తీస్తుంది. ఇది త్రీ డైమెన్షన్స్ ఇంప్రెషన్ ఇస్తుంది’’ అని ఇస్రో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 3Dలో ఈ ఫోటోని చూడాలంటే త్రీడీ గ్లాసెస్ వాడాలని ఇస్రో సూచించింది.
ఈ ఫోటో ఆగస్టు 30న తీసినదని ఫోటోలో స్పష్టంగా ఉంది. అంటే ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీప్ మోడ్‌లోకి పంపడానికి ముందే ఈ ఫోటోని తీశారు.