Tamilnadu Heavy Rains : తమిళనాడు (Tamilnadu)ను వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. మిగ్ జాం తుపాను నుంచి కోలుకోకముందే...మరో తుపాను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు ( Heavy Rains) తమిళనాడుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో...పలు జిల్లాల్లో జనజీనవ స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మత్స్యకారులు (Fishermen)ఇళ్లకే పరిమితం అయ్యారు. వేల మంది జనం నిరాశ్రయులయ్యారు. తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాలు వరణుడి బీభత్సానికి అతలాకుతలం అయ్యాయి. 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో  వర్షం కురిసిందని ముఖ్యమంత్రి (Chief Minister ) స్టాలిన్‌ (MK Stalin) తెలిపారు. తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఒక్కరోజులోనే ఏడాది వర్షం కురవడంతో...వరదలతో ఈ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు శాశ్వత సాయంగా రూ.12 వేల కోట్లు మధ్యంతర సాయంగా మరో 7 వేల కోట్లు సాయం కోరారు సీం స్టాలిన్. వరదల పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. తక్షణ సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. 


రికార్డుస్థాయిలో 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు


ఈ నెల 17, 18 తేదీల్లో వాతావరణశాఖ అంచనా వేసిన దాని కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాయల్పట్టినంలోనే రికార్డు స్థాయిలో 94 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గత 24 గంటల్లో తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూర్‌ కాయల్పట్టినంలో 95 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తిరుచ్చెందూర్‌లో 69 సెం.మీ., శ్రీ వైకుంఠం పాత తాలూకా కార్యాలయం 62 సెం.మీ., మాంజాలై 55 సెం.మీ., కోవిల్పట్టి 53 సెం.మీ., కుండనీర్‌ జలాశయం 51 సెం.మీ., ఓత్తు 50 సెం.మీ. వర్షం కురిసింది. ఎనిమిది మంది మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 14 వేల మందికిపైగా వరద బాధితులను ప్రత్యేక శిబిరాలకు తరలించారు. ప్రత్యేక టీంలు, వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు హెలికాప్టర్ సాయంతో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాల్లోనే, కుటుంబానికి 6వేల చొప్పున తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. 


వరదలపై బుధవారం సమీక్ష


 శ్రీ వైకుంఠంలోని రైల్వే స్టేషన్‌ చుట్టూ నీరు చేరింది. రైలు పట్టాలు దెబ్బతినడంతో రైళ్లు రాకపోకలు ఆగిపోయాయి. విపత్తు నిర్వహణ ప్రతిస్పందన దళం సహాయక చర్యుల చేపట్టాయి. 
వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్‌ ఆదేశించారు. ప్రస్తుతం భారీస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరైంది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. వందేభారత్ సహా 17 రైళ్లు రద్దయ్యాయి.