ABP  WhatsApp

SC on Sedition Law: రాజద్రోహం కేసులపై కేంద్రానికి సుప్రీం 24 గంటల డెడ్‌లైన్

ABP Desam Updated at: 10 May 2022 04:57 PM (IST)
Edited By: Murali Krishna

SC on Sedition Law: రాజద్రోహం చట్టంపై ఇప్పటివరకు నమోదైన కేసుల్లో తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేసే విషయంపై కేంద్రం నిర్ణయం తెలియజేయాలని సుప్రీం కోర్టు 24 గంటల డెడ్‌లైన్ విధించింది.

రాజద్రోహం కేసులపై కేంద్రానికి సుప్రీం 24 గంటల డెడ్‌లైన్

NEXT PREV

SC on Sedition Law:


రాజద్రోహ చట్టంలోని నిబంధనల (సెక్షన్ 124ఏ)ను పున:పరిశీలిస్తామని కేంద్రం చెప్పడంతో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం నమోదైన రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోందా? లేదా? తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. ఇందుకోసం 24 గంటల డెడ్‌లైన్ విధించింది.



ఐపీసీ సెక్షన్ 124ఏపై సమీక్ష పూర్తయ్యే వరకు ప్రస్తుతం విచారణలో ఉన్న రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించాలని భావిస్తోందా? లేదా? బుధవారం నాటికి ఈ విషయాన్ని కేంద్రం తెలియజేయాలి. రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించేంత వరకు విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నాం.  -                                                                సుప్రీం కోర్టు


సుప్రీం ఆందోళన


రాజద్రోహం చట్టం దుర్వినియోగమవుతోందని ఆందోళన ఉందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 124ఏపై పునఃపరిశీలన ప్రక్రియను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయాలని, అప్పటి వరకు ఈ సెక్షన్  ప్రకారం దాఖలైన కేసుల్లో తదుపరి చర్యలను చేపట్టకుండా తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని సలహా ఇచ్చింది.


చట్టంలో ఏముంది?


రాజద్రోహం చట్టం...భారత శిక్షాస్మృతిలోని 124 ఏ సెడిషన్ చట్టం ప్రకారం మాటలు, రాతలు, సైగల ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి శత్రుత్వాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించినా, ప్రేరేపించినా వారికి జరిమానా, జీవిత ఖైదు విధించే వీలుంది. బ్రిటీష్ హయాం నాటి ఈ చట్టాన్ని దేశంలో రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు అధికారపక్షం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందని ఉద్యమకారులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు.


విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టం కింద అరెస్టయిన దాఖలాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ అరెస్టయింది ఈ చట్టం కిందనే. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్​ 2019 మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది.


Also Read: Bangkok News: 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం- చివరికి ఏం చేశాడంటే?


Also Read: Sri Lanka Crisis: నిరసనకారుల 'లంకా దహనం'- రహస్య ప్రాంతానికి పారిపోయిన మాజీ ప్రధాని!

Published at: 10 May 2022 04:56 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.