Sri Lanka Crisis: శ్రీలంకలో నిరసనలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ముందు ఆందోళనకారులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. దీంతో నిరసనకారులు ప్రభుత్వ మద్దతు దారుల మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు వారి వాహనాలకు నిప్పు పెట్టారు. ఎంపీలు, అధికార పార్టీ నేతల ఇళ్లను ముట్టడించారు.
రాజపక్స ఎక్కడ?
ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స ప్రస్తుతం సురక్షితం ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం. త్రికోణమలైలో ఉన్న నావల్ బేస్‌లో ప్రస్తుతం మహింద రాజపక్స ఆశ్రయం పొందుతన్నట్లు తెలుస్తోంది. మహింద రాజపక్సతో పాటు ఆయన కుటుంబం కూడా అక్కడే తలదాచుకుంటున్నారు. రాజధాని కొలంబోకు సుమారు 270 కిలోమీటర్ల దూరంలో ఈ త్రికోణమలై నావల్ బేస్ ఉంది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఫ్యామిలీతో కలిసి మాజీ ప్రధాని రాజపక్స నౌకాశ్రయానికి వెళ్లినట్లు భావిస్తున్నారు.
రణరంగంగా
మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన తర్వాత శ్రీలంకలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. రాజధాని కొలంబోలో మొదలైన హింసాత్మక ఘర్షణలు దేశమంతా విస్తరించాయి. ఈ అల్లర్లలో ఓ ఎంపీ సహా 8 మంది మృతి చెందారు. దాదాపు 200 మందికిపైగా గాయాలయ్యాయి.
పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలపై ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. మాజీ మంత్రి జాన్‌స్టన్ ఫెర్నాండోకు చెందిన కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆయనకు చెందిన హోటళ్లకు కూడా నిప్పంటించారు. మాజీ మంత్రి నిమల్ లాన్‌జా ఇంటిపైనా దాడి చేశారు. హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల ఇంటిని నిరసనకారులు తగులబెట్టారు. కురునెగలలోని ప్రధాన మంత్రి మహీందా ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు.