Coromandel Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్షణక్షణం పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదస్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత దుర్ఘటన 2009 నాటి రైలు ప్రమాదాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పుడు కూడా శుక్రవారం రోజు, ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం జరిగింది.


అదే ట్రైన్, అదే రోజు, రాత్రి వేళ ప్రమాదం


దాదాపు 14 ఏళ్ల క్రితం 2009వ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం జరిగింది. ఆ రోజు కూడా శుక్రవారం. రాత్రి ఏడున్నర నుంచి 7.40 గంటల మధ్య ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ అత్యంత వేగంతో జైపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతోంది. ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో అదుపు తప్పడంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంజిన్ పక్కనే ఉన్న మరో ట్రాక్ పై పడిపోయింది. ఆ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. 


ఒడిశా ప్రమాదం ఎలా జరిగింది..? 


రైల్వే అధికారుల సమచారం ప్రకారం.. 12841 షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.20 నిమిషాలకు షాలిమార్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరింది. బాలాసోర్‌కి సాయంత్రం 6.30 నిమిషాలకు చేరుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి చెన్నై బయల్దేరిన ట్రైన్ సరిగ్గా 7.20 నిముషాల సమయంలో బాలేశ్వర్ వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. దాదాపు 10-12 కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అప్పటికే అక్కడ ఓ గూడ్స్ ట్రైన్ పార్క్ చేసి ఉంది. ఆ గూడ్స్ ట్రైన్‌ని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బలంగా ఢీకొట్టాయి. ఆ తర్వాత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పడిపోయిన ట్రాక్‌ పైన 12864  బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. అప్పటి వరకూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పడిపోయినట్టు ఎవరికీ సమాచారం అందలేదు. వేగంగా దూసుకొచ్చిన హౌరా ఎక్స్‌ప్రెస్‌ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. ఫలితంగా.. మూడు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. అంటే ఇవి ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాద సమయంలో రెండు రైళ్లూ వేగంగా ఉండటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా నమోదైంది. ఇదంతా మొత్తం 20 నిముషాల్లోనే జరిగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు ఆ నిద్రలోనే కన్నుమూశారు.