Coromandel Express Accident: 


275 మంది మృతి 


ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 88కి పైగా మృతదేహాలను గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు ఒడిశా సీఎస్ ప్రదీప్ జేన్. ఇంకా 180 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. వాళ్లను గుర్తించి అప్పగించడం సవాలుగా మారింది. కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. వాళ్లతో పాటు ఉన్న వస్తువులు కూడా చెల్లాచెదురయ్యాయి. కుటుంబ సభ్యులకూ తమ వాళ్లను గుర్తించడం కష్టమవుతోంది. భువనేశ్వర్‌లోని AIIMSకి దాదాపు 110 డెడ్‌బాడీలను తరలించారు. మిగతా మృతదేహాలను క్యాపిటల్ హాస్పిటల్, సమ్ హాస్పిటల్‌తో పాటు మరి కొన్ని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. కొద్ది రోజుల పాటు మృతదేహాలను అక్కడే ఉంచనున్నారు. కుటుంబ సభ్యులకు అప్పగించడంలో సమస్యలు తలెత్తుతుండడం వల్ల ఆసుపత్రి సిబ్బంది ఫోటోలు తీసింది. ఆ ఆల్బమ్‌ని అందరికీ అందుబాటులో ఉంచింది. మృతుల బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ ఫోటోలు చూసి వాళ్లలో తమ వాళ్లెవరో వెతుక్కుంటున్నారు. తన తమ్ముడిని కోల్పోయిన ఓ యువకుడు ఇలాగే ఓ ఆల్బమ్‌లోని ఫోటోలు తీసుకున్నాడు. 


"నా దగ్గర మా మా తమ్ముడి ఫోటో ఉంది. కానీ ఇక్కడి సిబ్బంది మాతో ఏమీ చెప్పడం లేదు. ఏ సమాచారం ఇవ్వడం లేదు. ఈ హాస్పిటల్‌లోనే వాడి డెడ్‌బాడీ ఉంది. కానీ మేం గుర్తించలేకపోతున్నాం"


- యువకుడు 


మరో యువకుడిదీ ఇదే బాధ. ఈ ప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్నాడు. ఆమె డెడ్‌బాడీని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించినట్టు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వచ్చి చూశాడు. ఎంత జల్లెడ పట్టినా ఆమె మృతదేహం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ని సందర్శించారు. మృతదేహాలను గుర్తించి అప్పగించే ప్రక్రియ ఎలా జరుగుతోందో ఆరా తీశారు. 


ఒడిశాలోని బాలోసోర్‌లో ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. బాహనాగ్‌ వద్ద పట్టాలు పునరుద్దరించిన తర్వాత ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్సు రైలును వెళ్లనిచ్చారు. రైల్వే మంత్రి దీన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జూన్ రెండో తేదీని ధ్వంసమైన ట్రాక్‌ను పునరుద్దరించిన తర్వాత విశాఖ ఓడరేవు నుంచి రూర్కెలా స్టీల్ ప్లాంట్‌కు  వెళ్లే గూడ్స్ రైలు సర్వీస్‌ను ప్రారంభించారు. మరో రెండు రోజు ఈ మార్గాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే రెగ్యులర్‌ సర్వీస్‌లు పునరుద్దరిస్తారు. తక్కువ సమయంలోనే రైలు మార్గాన్ని పునరుద్దరించిన సిబ్బందిని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అభినందించారు. ప్రమాదం జరిగిన బహనాగ్‌ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై పడి ఉన్న రైలు బోగీలను తొలగించే పనులు ముమ్మరంగా సాగాయి. ట్రాక్ పై పడి ఉన్న రైలు బోగీలను ముక్కలు ముక్కలుగా పడి ఉన్న ఎక్స్ ప్రెస్ రైలు బోగీలన్నింటినీ తొలగించారు. పట్టాలు, విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేపట్టారు. ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని బహనాగ్‌ ప్రాంతంలో 51 గంటల తర్వాత రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. 


Also Read: Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌పై స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకున్న మైనర్ రెజ్లర్, ఇంతలోనే ఏం జరిగింది?