ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహనాగా స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొన్న అనంతరం పట్టాలు తప్పింది. 7 బోగీలు పట్టాలు తప్పిన ఈ ప్రమాదంలో 150 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. కోల్‌కతా నుంచి చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. 132 మందిని సోరో సీహెచ్‌సీకి, గోపాల్ పూర్ సీహెచ్సీ, ఖాంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ మీడియాకు వెల్లడించారు.
సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి 7 గంటల తరువాత ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంబులెన్సులలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీలైతే ప్రమాదం జరిగిన చోట కొందరికి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అధికారులో బాలేశ్వర్ లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 044- 2535 4771, 06782 262286 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
హౌరా హెల్ప్ లైన్ నెంబర్: 03326382217
ఖరగ్ పూర్ హెల్ప్ లైన్ నెంబర్: 8972073925, 9332392339
బాలాసోర్ హెల్ప్ లైన్ నెంబర్: 8249591559, 7978418322
కోరమండల్ రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్ ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నా ఆలోచనలు బాధితుల గురించి. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి ప్రమీలా మల్లిక్, స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ)ని ఒడిశా సీఎం ఆదేశించారు. ఒడిశా ప్రత్యేక రిలీఫ్ కమీషనర్ (SRC), సీనియర్ అధికారులు హేమంత్ శర్మ, బల్వంత్ సింగ్, అరవింద్ అగర్వాల్, అగ్నిమాపక సేవల డీజీతో పాటు సహాయక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజా రైలు ప్రమాదంతో బాలాసోర్ జిల్లా, చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను అలర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతానికి మూడు ఎన్టీఆర్ఎఫ్ టీమ్ లు, నాలుగు ODRAF టీమ్స్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడు సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎంకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.