Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 260 మందికిపైగా మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. 900 మంది తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 


మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షలు పరిహారం


ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 


 






రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఒడిశా 


ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద మృతులకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డ వారికి రూ.2 లక్షలు ఇవ్వనుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కంట్రోల్ రూమ్ కు వెళ్లారు. రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను అప్రమత్తం చేసి సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు. 






రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్న తమిళనాడు


ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. గాయపడ్డ 50 మందికిపైగా క్షతగాత్రులను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. రైలు ప్రమాదంపై సీఎం స్టాలిన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.






రైలు ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన వారే ఎక్కువ


రైలు ప్రమాదంలో బెంగాల్ కు చెందిన ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారు. ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సర్కారు తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల  చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తీవ్ర గాయాలైన వారికి ఒక్కొక్కరికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సీఎంవో ట్వీట్ చేసింది.