Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గత దశాబ్ద కాలంలో ఇలాంటి ఘోర ప్రమాదం జరగలేదు. రెండు ప్రయాణికుల రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొట్టడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత బెంగళూరు-హావ్‌డా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి పక్క ట్రాక్ పై పడింది. దానిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని, ఆ తర్వాత కోరమాండల్ కోచ్ లను పక్కనున్న ట్రాక్ పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొట్టినట్లు చెబుతున్నారు. రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాత్రం మరోలా చెబుతున్నారు. మొదట కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, నిలిపి ఉంచి గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పిందని, వాటి బోగీలను బెంగళూరు-హావ్‌డా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్ననట్లు ఆయన చెబుతున్నారు.
రైల్వే అధికారి ప్రకారం గూడ్సు రైలు ఉన్న ట్రాక్‌పైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అలా ఎలా అనుమతించారనేది తెలియాల్సి ఉంది. సిగ్నల్ వ్యవస్థ లో లోపం కారణంగా ఇలా జరిగిందా.. లేదా మానవ తప్పిదం వల్ల ఇలా జరిగిందా అనేది అంతుచిక్కడం లేదు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనక కారణాలు ఏంటి అనే దానిపై అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక, మానవ తప్పిదాలను కారణాలుగా చూపుతున్నా.. కచ్చితమైన కారణం ఏంటి అనేది తెలుసుకునే విషయంలో అధికారులు తలమునకలయ్యారు.
ప్రమాదానికి సంబంధించి 10 ప్రశ్నలు
1. ముందుగా ట్రాక్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా?
2. ట్రాక్ ల సాధారణ తనిఖీల్లో నిర్లక్ష్యం ఉందా?
3. ట్రాక్ లలో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా?
4. అతి వేగం కారణంగా రైలు పట్టాలు తప్పిందా?
5. రైళ్లలో యాంటీ కొలిషన్ సిస్టమ్(కవచ్) ఉందా? లేదా?
6. ఒకవేళ కవచ్ ఉంటే రైళ్లు అలా ఏలా ఢీకొన్నాయి?
7. జీపీఎస్ పర్యవేక్షణలో రైలు ప్రమాదాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు?
8. స్టేషన్ సమీపంలో ఉన్నా.. రైళ్లు ఎందుకు అంత వేగంతో వెళ్లాయి?
9. దురంతో ఎక్స్‌ప్రెస్ ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ విఫలమైందా?
10. ఫిష్ ప్లేట్ వదులుగా ఉందా లేదా ట్రాక్‌లో పగుళ్లు ఏర్పడ్డాయా?
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న కార్మికులు ప్రమాదాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
"నేను అప్పటి వరకూ పడుకుని ఉన్నా. టాయిలెట్ కోసం అని అప్పుడే లేచి బాత్‌రూమ్‌లోకి వెళ్లాను. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కోచ్ మొత్తం ఊగిపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. కోచ్ అదుపు తప్పి పడిపోతుందని నాకు తెలుస్తూనే ఉంది. మేం తేరుకునే లోపే ప్రమాదం జరిగింది. ఎలాగోలా కోచ్‌లో నుంచి బయటకు వచ్చాను." - బాధితుడు
ఈ ప్రమాదంలో కొందరు శరీరాలు ఛిద్రమైపోయాయి. చేతులు ఓ చోట, కాళ్లు మరో చోట..ఇలా ఎక్కడ పడితే అక్కడ శరీర భాగాలు తెగి పడ్డాయి. ఇది చూసి ఇంకా భయ భ్రాంతులకు గురయ్యారు ప్రయాణికులు. రెస్క్యూ టీమ్ ప్రస్తుతానికి వాటన్నింటినీ సేకరించి ఒక్క చోటకు చేర్చుతోంది. మృతదేహాలనూ తరలిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డ ఓ బాధితుడు శరీరభాగాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండటాన్ని చూసి వణికిపోయినట్టు వివరించాడు.
"ప్రమాదం జరిగినప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా నాపైన 10-15 మంది పడ్డారు. ఉలిక్కి పడి లేచాను. అప్పటికే కోచ్ పడిపోయింది. చాలా సేపటి వరకూ బయటకు రావడానికి దారి దొరకలేదు. ఎలాగోలా బయటకు వచ్చాను. వచ్చీ రాగానే అక్కడి దృశ్యాలు చూసి వణికిపోయాను. కాళ్లు, చేతులు..ఇలా శరీర భాగాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. కొంత మంది ముఖాలు పూర్తిగా ఛిద్రమైపోయాయి" - బాధితుడు
ఓ కోచ్‌లో ఒకే బ్యాచ్‌కి చెందిన 26 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. "ఇది మా అదృష్టం" అని ఎమోషనల్ అవుతున్నారు వాళ్లంతా.
"S-2, S-3,S-4 కోచ్‌లలో మేమున్నాం. ఉన్నట్టుండి మాకు పెద్ద శబ్దం వినిపించింది. బోగీలు బోల్తా పడ్డాయి. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. అదృష్టవశాత్తూ మాకు ఏమీ కాలేదు. సురక్షితంగా బయటపడ్డాం" - బాధితుడు