Coromandel Express Accident:
పెరుగుతున్న మృతుల సంఖ్య
ఒడిశా రైలు ప్రమాదంపై దేశ ప్రజలందరినీ షాక్‌కి గురి చేసింది. మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. పరిహారం ప్రకటించాయి. రెస్క్యూ టీమ్ రాత్రి నుంచి క్షణం కూడా ఆగకుండా పని చేస్తూనే ఉంది. ప్రమాదంలో దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వాళ్లందరినీ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహాయక చర్యల్ని సమీక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆయనతో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒడిశాలో ఇవాళ సంతాప దినం ప్రకటించారు. అయితే..అసలు ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడానికి కారణాలేంటి..? కమ్యూనికేషన్ లోపమా..? లేదంటే టెక్నికల్ సమస్యా..అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర రైల్వే శాఖ. ఈ ప్రమాదంలో మొత్తం మూడు రైళ్లు నుజ్జునుజ్జయ్యాయి.
ఎలా జరిగింది..?
రైల్వే అధికారుల సమచారం ప్రకారం...12841 షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.20 నిముషాలకు షాలిమార్ స్టేషన్ నుంచి బయల్దేరింది. బాలాసోర్‌కి సాయంత్రం 6.30 నిముషాలకు చేరుకుంది. ఆ తరవాత అక్కడి నుంచి చెన్నై బయల్దేరిన ట్రైన్ సరిగ్గా 7.20 నిముషాల సమయంలో బాలేశ్వర్ వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. దాదాపు 10-12 కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అప్పటికే అక్కడ ఓ గూడ్స్ ట్రైన్ పార్క్ చేసి ఉంది. ఆ గూడ్స్ ట్రైన్‌ని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బలంగా ఢీకొట్టాయి. ఆ తరవాత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పడిపోయిన ట్రాక్‌పైన 12864 బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. అప్పటి వరకూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పడిపోయినట్టు ఎవరికీ సమాచారం అందలేదు. వేగంగా దూసుకొచ్చిన హౌరా ఎక్స్‌ప్రెస్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. ఫలితంగా..మూడు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. అంటే ఇవి ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాద సమయంలో రెండు రైళ్లూ వేగంగా ఉండటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా నమోదైంది. ఇదంతా మొత్తం 20 నిముషాల్లోనే జరిగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు ఆ నిద్రలోనే కన్నుమూశారు.
Also Read: Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ప్రస్తుతానికి 288 మంది మృతి