Coromandel Express Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) ఘోర రైలు ప్రమాదం దేశంలోనే పెను విషదాన్ని నింపింది. అయితే ఇప్పటి వరకు ఈ ఘోర దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 650 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోల్‌కతాలోని షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకి బయలు దేరిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గతరాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో పట్టాలు తప్పింది. దీంతో కోచ్ లు పట్టాలు తప్పడంతో సమీపంలోని మరో ట్రాక్ పై పడిపోయాయి. మరి కొద్ది నిమిషాల్లో యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న రైలు, అదే మార్గంలో వస్తున్న సరుకు రవాణా రైలు పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొన్నాయి.
రక్తదానం చేసేందుకు తరలివస్తున్న వేలాది యువకులు
ప్రమాదం జరిగిందని తెలిసినప్పటి నుంచి జాతీయ మరియు రాష్ట్ర రెస్క్యూ బృందాలు బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల వివరాలు కనుక్కుంటే వారిని వారి స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేసేందుకు వందలాది మంతి ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. ఎవరూ అడగక ముందే ప్రజలు రక్తం ఇచ్చేందుకు ఆస్పత్రులకు రావడం నిజంగా హర్షణీయం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అడిగినా సాయం చేయని వారున్న ఈ కాలంలో.. అడక్క ముందే ఆదుకునేందుకు వస్తున్న జనాలను చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు. బాలాసోర్ లో మానవత్వం వెల్లివిరిసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
సహాయక చర్యలు చేపడుతున్న డ్రోన్ విజ్యువల్స్ వైరల్
ప్రస్తుతం 14 యూనిట్ ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, కొన్ని ఎస్ఆర్డీఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. 1200 మందికి పైగా సిబ్బంది, 38 మంది ఫైర్ సేఫ్టీ అధికారులు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజ్యువల్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఈ రోజు అన్ని కార్యక్రమాలను రద్దు చేసారు. సంతాప దినంగా ప్రకటించారు. అదే విధంగా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.
మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు
అలాగే మృతులు, తీవ్రంగా గాయపడిన, స్వల్పంగా గాయపడిన వారికి రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు నష్ట పరిహారం ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైలు ప్రమాదం కారణంగా సంబంధిత మార్గంలో నడిచే 30కి పైగా రైళ్లు రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది.