Odisha Government: హౌస్ అరెస్ట్ అంటే తెలుసు కదా.. ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు బయటకు రాకుండా ఇంట్లోనే అడ్డుకోవడం. ఇకపై అండర్‌ ట్రయల్ ఖైదీలను కూడా హౌస్ అరెస్ట్‌లు చేయనుంది ఒడిశా ప్రభుత్వం. అలాంటి వారి కోసం ఒడిషా సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  తీవ్ర నేరారోపణలు లేని అండర్ ట్రయల్ ఖైదీల కోసం GPS ట్రాకింగ్ పరికరాలను ఉపయోగించే మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలువనుంది.


జైలు రద్దీని తగ్గించడం కోసం ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల ఖరీదు రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది. ఒకసారి దీనిని కాలి చీలమండకు వేయడం ద్వారా వ్యక్తి కదలికలను సులువుగా పసిగట్టవచ్చు. పైగా దానిని ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 


దీనిలో ఒక నిర్దేశిత ప్రాంతం, చుట్టుకొలత ఆధారంగా ప్రోగ్రామ్ చేసి ఉంటారు. ఇది ధరించిన వ్యక్తి  ఆ ప్రాంతం సరిహద్దులను దాటితే పోలీసులకు అలెర్ట్ పంపుతుంది. అలాగే బెయిల్ రద్దు చేసేందుకు అవకాశం ఉంది. జైళ్లలో ప్రమాదకరమైన నేరస్థుల కదలికలను నియంత్రించడానికి కూడా ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చు.


చిన్న నేరాలకు పాల్పడే ఖైదీలను జైళ్లకు పంపకుండా వారి ఇళ్లలోనే బంధించగలిగే సాంకేతికతను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు జైళ్ల శాఖ డీజీ మనోజ్ కుమార్ ఛబ్రా చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల, డైరెక్టరేట్ అండర్ ట్రయల్స్ కోసం యాంకిల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను హోంవ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు సమర్పించింది. ఒడిశా ప్రభుత్వం ప్రారంభించి ఈ జైలు సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావించింది.


జైల్లలో రద్దీ పెరిగిపోయిందని, దానిని పరిష్కరించడం కోసం ఇలాంటి పరికరాలను రూపొందించేలా చేసిందని ఛబ్రా చెప్పారు. గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో రాష్ట్రాలకు సూచించింది. ఒడిశా జైళ్లలో దాదాపు 65% మంది ఏడేళ్ల వరకు శిక్ష విధించే నేరాల్లో జైళ్లలో ఉన్నారు. బెయిల్ మంజూరు సమయంలో, అండర్ ట్రయల్‌ ఖైదీలకు రెండు ఎంపికలు ఉంటాయన్నారు.


జైలు శిక్ష కావాలా లేదా బెయిల్ కావాలో ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు.  బెయిల్ కావాలని అడిగితే వారికి ట్రాకింగ్ పరికరాన్ని తప్పనిసరి చేయవచ్చన్నారు. ప్రభుత్వం పరికరాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, బెయిల్‌ కోరే వ్యక్తిని పరికరాన్ని కొనుగోలు చేయమని అడగవచ్చని ఛబ్రా చెప్పారు.