Modi Putin Phone Call: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంశాలపై చర్చించారు. అలాగే ఇరు దేశాలకు చెందిన ఉమ్మడి సమస్యలు, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంతో సహా పలు అంశాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ సందర్భంగా 2023 సెప్టెంబరు 9, 10 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి పలు కారణాలతో హాజరుకాలేకపోతున్నట్లు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. రష్యా నిర్ణయాన్ని అంగీకరిస్తూ పుతిన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. G20 కార్యక్రమాలకు రష్యా మద్దతు కావాలని కోరారు. భారత్- రష్యా మధ్య ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందుతోందని క్రెమ్లిన్ అభిప్రాయపడింది.


సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ ముగింపులో G20 లీడర్స్ డిక్లరేషన్ ఆమోదించబడుతుంది. ఈ జీ20 నేతల సమావేశానికి పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకావడం లేదని ఆగస్టు 25న క్రెమ్లిన్ ప్రకటించింది. అధ్యక్షుడికి అలాంటి ప్రణాళికలు లేవని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. 


ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధమే ఇందుకు కారణమని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ క్లారిటీ ఇచ్చారు. జీ20 సమ్మిట్ కోసం వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. ప్రస్తుతం తమ దృష్టి సైనిక చర్య మీదే ఉందన్నారు. అయితే.. ఈ సమ్మిట్‌లో పుతిన్ వర్చువల్‌గా పాల్గొంటారా? లేదా? అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.  


ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రకటించినప్పటి నుంచి పుతిన్‌పై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఉక్రెయిన్‌లోని పిల్లలను రష్యా అపహరించిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన విదేశీ పర్యటనలు ఆపేశారు. ఒకవేళ విదేశాలకు పుతిన్ వెళ్తే.. ఆయన్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఈ కారణంతోనే ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరు కాలేదు. కేవలం వర్చువల్‌గా మాత్రమే ఆ సదస్సుకు హాజరయ్యారు.