Odisha Bus Driver:
గుండె పోటు..
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఘోర ప్రమాదం తప్పింది. బస్ డ్రైవర్‌కి ఉన్నట్టుండి గుండె పోటు వచ్చింది. ఆ సమయంలోనూ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్ బస్‌ని గోడకి ఢీకొట్టాడు. ఈ ప్రమాద సమయంలో 48 మంది ప్రయాణికులు బస్‌లో ఉన్నారు. బస్ గోడకు ఢీకొట్టిన తరవాత చివరి శ్వాస విడిచాడు డ్రైవర్. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ప్యాసింజర్స్ ప్రాణాలు కాపాడి చివరకు కన్నుమూశాడు బస్ డ్రైవర్. పబూరియా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. డ్రైవర్ పేరు సనా ప్రధాన్‌గా గుర్తించారు. బస్ నడుపుతుండగా ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చింది. స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్‌ని నేరుగా గోడకు ఢీకొట్టాడు.
"బస్ నడుపుతుండగా ఉన్నట్టుండి డ్రైవర్‌కి ఛాతిలో నొప్పి వచ్చింది. ఇక డ్రైవ్ చేయలేనని అర్థమైంది. అందుకే రోడ్డుపక్కనే ఉన్న గోడను ఢీకొట్టాడు. ఈ ధాటికి బస్ అక్కడే ఆగిపోయింది. ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది"
- పోలీసులు
ఈ ఘటన జరిగిన వెంటనే బస్ డ్రైవర్‌ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మరో బస్ వచ్చి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.