Poverty Index News: దేశంలో పేదరికం తగ్గినట్టు నీతిఆయోగ్ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్-ఎ ప్రోగ్రెసివ్ రివ్యూ -2023పేరుతో విడుదల చేసిన ఆ నివేదికలో కీలకాంశాలను ప్రస్తావించింది. ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతోపాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, బడికి వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర 12 అంశాలనే కొలమానంగా ఈ నివేదికను రూపొందించింది.
2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలన్న లక్ష్యంతో..!
ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ ఘనతను 2016-21 మధ్య కాలంలో సాధించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 2015-16లో 24.85 శాతం ఉందని తెలిపింది. అలాగే 2019-21లో 14.96 శాతానికి తగ్గిందని.. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను ప్రజలు అందుకునే శక్తిని బట్టి పేదరికాన్ని లెక్కిస్తారు. గ్రామాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి తగ్గిందన్నారు. పట్టణాల్లో 8.65 శాతం నుంచి 5.27కు తగ్గింది. 2030 నాటికి దేశంలో పేదరికాన్ని సగానికి తగ్గించాలన్న లక్ష్యం దిశగా దూసుకెళ్తుందని తెలుస్తోంది.