కరోనా పేరు చెప్తేనే ఇప్పటికీ ప్రజలు వణికిపోతారు. ఇప్పటి తరం చూసిన భయంకరమైన వైరస్‌ కరోనా. ప్రపంచంపై విరుచుకుపడింది. ప్రజలను ఇళ్లు కదలనివ్వకుండా  చేసింది. పిల్లల చదువులు సత్తుబండలు చేసింది. సుమారు 70లక్షల మందిని బలితీసుకుంది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఆ మహమ్మారి నుంచి  కోలుకుని.. సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో... కరోనా కంటే ఇంకా డేంజర్‌ అయిన నిఫా వైరస్‌ భారత్‌లో వెలుగుచూసింది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే  అక్కడ ఆరు నిఫా కేసులను ధృవీకరించారు. కోజికోడ్‌లో సెప్టెంబర్ 12 నంచి నిఫా వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కేరళలో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని  భావిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు అధికారులు. వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు కూడా పంపిణీ చేస్తున్నారు.


కొవిడ్ కంటే ప్రమాదకరం.. 
నిఫా ప్రాణాంతక వ్యాధి అంటోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. కొవిడ్​ కంటే నిఫా వైరస్ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తోంది.నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం  చెల్లించుకోక తప్పదని వార్నింగ్‌ ఇస్తోంది. నిఫా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిని గట్టిగా చెప్పారు... ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ డాక్టర్.  రాజీవ్‌ బాల్‌. కోవిడ్ మరణాలతో పోలిస్తే నిఫా వైరస్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ వల్ల 2 నుంచి 3 శాతం మరణాలు సంభవిస్తే.. నిఫా వైరస్  వల్ల 40 నుంచి 70 శాతం మరణాలు నమోదవుతాయని చెప్పారు. ప్రారంభదశలోనే నిఫా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయాలని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.


నిఫా వైరస్‌ బాధితులకు చేసే చికిత్సలో మోనోక్లీనల్ యాంటీబాడీ మందు ముఖ్యమైనది చెప్పారు ICMR డీజీ. అయితే.. ప్రస్తుతం తమ దగ్గర 10 మంది రోగులకు సరిపడే  మోనోక్లీనల్ యాంటీబాడీ మందు మాత్రమే ఉందన్నారు. మరో 20 డోసులను కొనుగోలు చేస్తామన్నారు. 2018 నుంచే మోనోక్లీనల్ యాంటీబాడీ మందును ఆస్ట్రేలియా నుంచి  కొనుగోలు చేస్తున్నామని చెప్పారాయన. మన దేశంలో ఇప్పటివరకు నిఫా వైరస్ రోగుల్లో ఒక్కరికి కూడా మోనోక్లీనల్ యాంటీబాడీల మందును ఇవ్వలేదు. విదేశాల్లోని 14  మంది నిఫా రోగులకు మోనోక్లీనల్ యాంటీబాడీలు ఇచ్చామని.. వారందరూ కోలుకున్నారని చెప్పారు డాక్టర్ బాల్‌. అయితే... వైరస్‌ సోకిన వెంటనే ఈ మందు ఇవ్వాలని..  అప్పుడే పేషంట్‌ కోలుకుంటాడని చెప్తున్నారు. 
 
వర్షాకాలంలోనే నిఫా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బాల్ తెలిపారు. కేరళలో ఆరు నిఫా కేసులు వెలుగుచూడంతో.. వారి చికిత్సపై కూడా  ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే.. కేరళలోని నిఫా రోగులకు మోనోక్లీనల్ యాంటీబాడీలు ఉపయోగించాలనే నిర్ణయం.. వైద్యులు, రోగులు, వారి కుటుంబసభ్యులతో పాటు  కేరళ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ మెడిసిన్‌పై ట్రయల్స్ ఒక లెవల్‌లో మాత్రమే జరిగాయని.. ఎఫిషియన్సీ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. 
నిఫా వైరస్ గబ్బిలాల నుంచి మనుషలకు వ్యాపిస్తుందని 2018లో కనుగొన్నామని చెప్పారు ICMR డీజీ. కానీ వ్యాధి గబ్బిలాల నుంచి మనుషులకు ఎలా సంక్రమిస్తుందో  మాత్రం తెలియడంలేదన్నారు. ఈ విషయంలో ఇప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వైరస్‌ వ్యాపిలో వేగాన్ని తగ్గించేందుకు కరోనా సమయంలో  తీసుకున్న జాగ్రత్తల కంటే ఎక్కువగా తీసుకోవాలని... మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చేతులు పదే పదే శుభ్రం చేసుకోవాలని.. మాస్కులు  ధరించాలని చెప్పారు.