Madhya Pradesh Lightning : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పిడుగు పాటు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 24 గంటల్లో తొమ్మిది మంది మృతి చెందారు. విదిషా, సత్నా, గుణ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు మధ్యప్రదేశ్ అధికారులు వెల్లడించారు. భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.


చెట్టుకింద నిల్చోవడంతో పిడుగుపాటు


విదిషా జిల్లాలోని గంజ్ ‌బాసోడా తహసీల్‌ లోని అగసోడ్ గ్రామంలో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. వర్షం ఎక్కువగా పడుతోందని, వారంతా చెట్టు కింద నిల్చున్నారని, అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో నలుగురు చనిపోయినట్లు సిటీ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కున్వర్ సింగ్ ముకాటి తెలిపారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పిడుగుపాటు ఘటనలో గాలు మాలవ్య, రాము, గుడ్డా, ప్రభులాల్ గా అక్కడి అధికారులు గుర్తించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య వారిగా గుర్తించినట్లు వెల్లడించారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు.


పిడుగుపడి నలుగురు దుర్మరణం


సత్నాలో, పోడి-పటౌరా మరియు జట్వారా ప్రాంతాల్లో శనివారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్ బాలురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులను అంజన (34), చంద్ర (65), రాజ్‌కుమార్ (65), రామ్‌కుమార్ యాదవ్ (43)గా అధికారులు గుర్తించారు. గాయపడిన 12 మరియు 16 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలను ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. గుణాలో, భోరా గ్రామంలో శనివారం పిడుగు పాటుకు గురై 45 ఏళ్ల మహిళ మను అహిర్వార్ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. భారత వాతావరణ విభాగం ప్రకారం భారీ వర్షాలు మరియు మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు ఆదివారం మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రదేశాలలో సంభవించే అవకాశం ఉందని తెలిపింది. 


మరో మూడ్రోజుల పాటు అతి భారీ వానలు..


సోమవారం నుంచి మూడు రోజుల పాటు మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ విభాగం అంచనా వేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత 24 గంటల్లో వర్షాలు కురిశాయి. ఐఎండీ ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో గ్వాలియర్‌లో 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యప్రదేశ్‌ కు తేమను తీసుకువస్తున్నందున వర్షాలకు కారణం అవుతుందని IMD భోపాల్ కార్యాలయ సీనియర్ వాతావరణ నిపుణుడు వేద్ ప్రకాష్ సింగ్ తెలిపారు. అంతే కాకుండా రుతు పవన ద్రోణి రేఖ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందని ఆయన తెలిపారు.