ED Arrests Sanjay Singh In Money Laundering Case:


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తరువాత అరెస్ట్ అయ్యేది సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అని ఢిల్లీ బీజేపీ అంటోంది. లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్ట్ చేసింది. సంజయ్ సింగ్ అరెస్ట్ తరువాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. తరువాత అరెస్ట్ అయ్యేది సీఎం కేజ్రీవాల్ అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే నిజం దాచినా దాగదని, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదన్నారు. సంజయ్ సింగ్ తరువాత జైలుకు వెళ్లే నేత కేజ్రీవాల్ అనడంలో సందేహం లేదన్నారు. 


ఈడీ అధికారులు బుధవారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలో సాయంత్రం ఈడీ అధికారులు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తర్వాత అరెస్టయిన మూడో ఆప్ నేత సంజయ్ సింగ్. బీజేపీ  ఎంపీ మనోజ్ తివారీ సైతం సీఎం కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతిలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, త్వరలోనే ఆయన సైతం భారీ మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. ఆప్ నేతలు లెటర్స్ రాయడం చూస్తే, వారు నిజాయితీపరులు కాదని తెలుస్తోందని కీలకవ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సహ నిందితులు అప్రూవర్లుగా మారారు. సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలతోనే అరెస్టులు ఆగవని, ఆప్ అధినేత కేజ్రీవాల్ హస్తం ఉందని త్వరలోనే తేలుతుందని విమర్శించారు.


ఢిల్లీ మద్యం పాలసీ క్లైమాక్స్ కు చేరుకుందని, అందుకు సంజయ్ సింగ్ అరెస్ట్ కావడం.. త్వరలోనే కేజ్రీవాల్ ఈ అవినీతి సెగలు తాకుతాయన్నారు. అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్ ఈ కేసు నుంచి బయట పడటం అంత ఈజీ కాదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు.


ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలా...
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని, ఆప్ నేతలు ప్రజా ధనాన్ని దోచుకున్నారని బీజేపీ నేతలు 15 నెలల నుంచి ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈడీ, సీబీఐ ఇప్పటివరకూ 1000 చోట్ల సోదాలు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలకు ఆప్ నేతల వద్ద ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు. బీజేపీ నేతలు ఓటమి భయంతోనే దర్యాప్తు సంస్థలను ఆప్ నేతలపై ప్రయోగిస్తున్నారని రాఘవ్ చద్దా ఆరోపించారు. తాజాగా సంజయ్ సింగ్ ఇంటిపై ఆకస్మిక దాడులు చేసి ఆయనను ఈడీ అరెస్ట్ చేయడం ఇందుకు నిదర్శనం అన్నారు.


సీబీఐ ఛార్జ్‌షీట్ ప్రకారం... గతేడాది అక్టోబర్ 1వ తేదీన దినేష్ అరోరా ఈ కేసులో అప్రూవర్‌గా మారాడు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్టు సీబీఐకి చెప్పాడు. సంజయ్ సింగ్‌ ద్వారానే మనీశ్ సిసోడియాని కలిసినట్టు వివరించాడు. సంజయ్ సింగ్ సలహాతోనే రెస్టారెంట్‌ ఓనర్‌లతో మాట్లాడి రూ.82 లక్షల చెక్‌లు కలెక్ట్ చేసినట్టు చెప్పాడు. ఆ డబ్బులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు తెలిపాడు. ఈ డబ్బంతా మనీశ్ సిసోడియాకి ఇచ్చినట్టు అంగీకరించాడు.