Maharashtra Hospital Deaths: మహారాష్ట్ర ఆసుపత్రుల్లో మరణాలపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాందేడ్‌తోపాటు ఛత్రపతి శంభాజీనగర్‌ ఆసుపత్రుల్లో వరుసగా రోగులు మృత్యువాత పడటాన్ని న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ ఆరిఫ్‌ ఎస్‌ డాక్టర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. బడ్జెట్‌లో ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత కేటాయించింది? పెట్టిన ఖర్చు? వివరాలు తెలపాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది.


మహారాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల్లో మూడు రోజులుగా మరణాలు సంభవిస్తున్నాయి. నాందేడ్‌ ఆసుపత్రిలో 31 మంది, ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఆసుపత్రిలో 18 మంది చనిపోయారు. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో రోగులు మృత్యువాత పడ్డారు. ఈ వ్యవహారంపై మోహిత్‌ ఖన్నా అనే న్యాయవాది బాంబే హైకోర్టుకు లేఖ రాశారు. దానిని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ఓ పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. తద్వారా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. 


ఆసుపత్రుల్లో ఖాళీలు, మందుల లభ్యత, ప్రభుత్వం ఖర్చుచేస్తున్న నిధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆసుపత్రి పడకలు, సిబ్బంది, అత్యవసర మందుల కొరత ఉన్నట్లు వైద్యులు చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంది. శుక్రవారం ఈ దారుణ ఘటనపై విచారణ జరుపుతామని.. ఆలోపు వివరాలన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది.


మరణాలపై విచారణ కమిటీ
శంభాజీ నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో 14 మంది మరణించడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కళ్యాణ్‌కర్ స్పందించారు. మృతుల్లో ఇద్దరు శిశువులు ఉన్నారని, సిబ్బంది లేక మందుల కొరతతో మరణాలు సంభవించలేదని చెప్పారు. మహారాష్ట్ర వైద్య విద్యా మంత్రి హసన్ ముష్రిఫ్ మాట్లాడుతూ.. "నాందేడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో జరిగిన మరణాలపై ఒక కమిటీ  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరణాలకు కారణాలను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో లోటు పాట్లు ఉన్నాయని వచ్చే రెండు వారాల్లో వాటిని అధిగమిస్తామని, ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందన్నారు.


సీఎం ఏక్‌నాథ్ శిండే ఏమన్నారంటే
ఆసుపత్రుల్లో వరుస మరణాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం ఏక్‌నాథ్‌ శిండే అన్నారు. ఆసుపత్రుల్లో సిబ్బంది, ఔషధాల కొరత ఉందని వస్తోన్న వార్తలను ఆయన తోసిబుచ్చారు.


బీజేపీకి పేదల ప్రాణాలంటే లెక్కలేదు
ప్రమాదంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సోషల్ మీడియా Xలో విమర్శలు గుప్పించారు. ‘నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మరణించిన దురదృష్టకర సంఘటన దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. రెండు నెలల క్రితం, థానే మున్సిపల్ కార్పొరేషన్‌లోని కాల్వా హాస్పిటల్‌లో ఒకే రాత్రి 18 మంది మరణించినట్లు గుర్తు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోకపోవడంతో నాందేడ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో మరో సారి అత్యంత విషాదకర ఘటన పునరావృతమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి ఇది నిదర్శనం అన్నారు. 


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం ప్రమాదంపై ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వం తన పబ్లిసిటీ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని, కానీ పిల్లలకు మందులకు డబ్బులు ఖర్చే చేసే పరిస్థితిలో లేదని విమర్శించారు. బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదు అంటూ పోస్ట్ చేశారు.