Sanjay Singh Arrest:


ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే సంజయ్ సింగ్‌ గురించి ఈడీ చాలా సార్లు ప్రస్తావించింది. ఛార్జ్‌షీట్‌లోనూ ఆయన పేరు ఉంది. ఆయన ఇంట్లో తొలిసారి సోదాలు నిర్వహించింది ఈడీ. రోజంతా సోదాలు చేసిన తరవాత సాయంత్రానికి అరెస్ట్ చేసింది. అరెస్ట్‌కి ముందు సుదీర్ఘంగా విచారించింది. ఎన్నో ప్రశ్నలు వేసింది. 





పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఈడీ చెబుతోంది. సంజయ్ సింగ్ ఇంటి ఎదుట ఆయన మద్దతుదారులు చేరుకున్నారు. ఈడీ సోదాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. సత్యేంద్రజైన్‌తో పాటు మనీశ్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఇంకా లీగల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ విచారణ ఓ కొలిక్కి రాలేదు. సీబీఐ ఛార్జ్‌షీట్ ప్రకారం...గతేడాకి అక్టోబర్ 1వ తేదీన దినేష్ అరోరా ఈ కేసులో అప్రూవర్‌గా మారాడు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్టు సీబీఐకి చెప్పాడు. సంజయ్ సింగ్‌ ద్వారానే మనీశ్ సిసోడియాని కలిసినట్టు వివరించాడు. సంజయ్ సింగ్ సలహాతోనే రెస్టారెంట్‌ ఓనర్‌లతో మాట్లాడి రూ.82 లక్షల చెక్‌లు కలెక్ట్ చేసినట్టు చెప్పాడు. ఆ డబ్బులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు తెలిపాడు. ఈ డబ్బంతా మనీశ్ సిసోడియాకి ఇచ్చినట్టు అంగీకరించాడు.