National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దాదాపు 3 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఉదయం 11.30కు మొదలైన విచారణలో రాహుల్ గాంధీపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
అసోసియేట్ జనరల్ సంస్థలో రాహుల్ గాంధీ హోదా, యంగ్ ఇండియన్ సంస్థతో ఉన్న సంబంధమేంటి అనే అంశంపై ముఖ్యంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి ఎందుకు రుణాలిచ్చారని రాహుల్ గాంధీని ఈడీ అధికారులు అడిగారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
మళ్లీ విచారణకు
ఈ కేసులో రాహుల్ గాంధీ వాంగ్మూలం రికార్డు చేసిన ఈడీ మళ్లీ విచారణకు పిలుస్తామని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
దీంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దిల్లీలో ర్యాలీ చేపట్టిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ కేసు
కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.
ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా తదితరులు ఉన్నారు.
Also Read: IPL Media Rights Day-2: BCCI పంట పండింది- ఐపీఎల్ మీడియా హక్కులు @ రూ.43 వేల కోట్లు!
Also Read: Covid Update: దేశంలో కరోనా భయం- వరుసగా మూడో రోజూ 8 వేలకు పైగా కేసులు