Mars Spinning Faster: అంగారకుడు మునుపటి కంటే వేగంగా తిరుగుతున్నాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నాసాకు చెందిన ఇన్ సైట్ ల్యాండర్ అంగారకుడిపై నాలుగేళ్ల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన సైంటిస్టులు ఈ అభిప్రాయానికి వచ్చారు. జర్నల్ నేచర్ లో ఈ వివరాలు ప్రచురితం అయ్యాయి. అయితే ప్రతీ సంవత్సరం ఈ గ్రహం భ్రమణ వేగం 4 మిల్లి యార్క్ సెకండ్లు పెరిగిందని అంచనా వేశారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితంగా తమకు తెలియడం లేదని తెలిపారు. అంగారకుడి ధ్రువాల పైభాగంలో మంచు పేరుకుపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 


ఇటీవలే అంగారకుడిపై డోనట్.. ఫొటో తీసి పంపిన నాసా పర్సివరెన్స్ రోవర్


అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్న నాసాకు చెందిన పర్సివరెన్స్ రోవర్ తాజాగా ఓ ఫోటో తీసి నేలకు పంపగా.. అది వైరల్ అవుతోంది. జూన్ 22వ తేదీన పర్సివరెన్స్ రోవర్ ఈ పిక్ ను భూమికి పంపించింది. మార్స్ గ్రహంపై ఉన్న జెజీరో క్రేటర్ కు సంబంధించిన ఫోటోలను నాసా రోవర్ తీసే క్రమంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. అందులో డోనట్ ఆకారంలో ఉన్న ఓ రాయి కనిపించింది. రోవర్ కు సుమారు 100 మీటర్లు అంటే 328 అడుగుల దూరంలో అచ్చంగా డోనట్ ఆకారంలో ఉన్న రాయి రోవర్ కు తారసపడింది. దానిని తన కెమెరాలో బంధించి భూమిపైకి పంపించింది. కాగా, అంగారక గ్రహంపైకి నాసా రోవర్ పర్సివరెన్స్ అడుగు పెట్టి ఇప్పటికే 840 రోజులు పూర్తవుతున్నాయి. 


అమెరికాలోని న్యూ మెక్సికోలోని లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీ పర్సివరెన్స్ రోవర్ కు అమర్చిన సూపర్ క్యామ్ ను అభివృద్ధి చేసింది. అంగారక గ్రహం ఉపరితలంపై ఏవైనా సూక్ష్మజీవులు ఉన్నా ఈ కెమెరాతో వాటిని ఫోటో తీయగలిగేంత శక్తివంతంగా ఈ కెమెరాను తయారు చేసింది లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీ. రాళ్ల నమూనాలు, దుమ్మూ, ధూళి ఫోటోలను కూడా ఈ కెమెరా చాలా స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీసి పంపించగలదు. తద్వారా అంగారకుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉపరితలం స్థితిగతులపై శాస్ట్రవేత్తలు అధ్యయనం చేస్తూ వస్తున్నారు. 


అంగారకుడిపై 2021 నుంచి ప్రయోగాలు


భూమిపై కాకుండా ఇతర గ్రహాల్లో జీవం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర గ్రహాల మీదికి ఉపగ్రహాలు, రోబోలను పంపుతున్నారు. అలా పంపించిందే ఈ పర్సివరెన్స్ రోవర్. జెజెరో క్రేటర్ అనే ప్రాంతంలో నాసా రోవర్ పరిశోధనలు సాగిస్తోంది. బిలియన్ సంవత్సరాల క్రితం 45 కిలోమీటర్ల పొడవైన ఈ జెజెరో క్రేటర్ ప్రాంతంలో ఓ నది ప్రవహించేది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ రోవర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ తో సహా కీలక నమూనాలను సేకరించింది. ఇక్కడ సేకరించిన నమూనాల్లో హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, పాస్ఫరస్, సల్ఫర్ వంటి పరమాణువులు ఉన్నట్లు నాసా గుర్తించింది.


ఈ తాజా చిత్రాన్ని SETI ఇన్‌స్టిట్యూట్ డోనట్ ఆకారంలో ఉన్న శిల ఫోటోను షేర్ చేసింది. సూపర్ క్యామ్ రిమోట్ మైక్రో- ఇమేజర్ సహాయంతో తీసిన ఈ చిత్రంలో డోనట్ ఆకారాన్ని స్పష్టంగా కనిపిస్తోంది. చాలా దూరంలో ఉన్నప్పటికీ ఇంత స్పష్టంగా ఫోటో చిత్రీకరించడం విశేషం. అంతకుముందు బెల్వా క్రేటర్ లోకి చూస్తున్నప్పటి చిత్రాలు కూడా విశేష సమాచారాన్ని అందించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడు కూడా పర్సివరెన్స్ రోవర్ లోని మాస్ట్ క్యామ్-Z పరికరం 152 చిత్రాలను క్లిక్‌ మనిపించింది. ఆ ఫోటోల్లో నదిలో ఉండే అలల తరహా అల్లకల్లోల సంకేతాలు స్పష్టంగా కనిపించాయి.