సినీ నటి , కాంగ్రెస్ నేత నగ్మా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ స్థానాల జాబితాలో నగ్మాకు చోటు లభించలేదు. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా తన స్వరాన్ని వినిపించారు. రాజ్యసభలో అడుగుపెట్టడానికి తనకు అర్హత లేదా? అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈసారి రాజ్యసభకు వెళ్లాలని ఎంతగానో ఎదురు చూసిన నగ్మా.. తన కోరిక నెరవేరకపోవడంతో నిరసన స్వరం పెంచారు. 18 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన సమయంలో మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సీటు ఇస్తానని సోనియా గాంధీ హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదని నగ్మా అన్నారు. నగ్మా ట్వీట్ వైరల్ అయింది.
మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్ ఘడి అనే నేతను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇమ్రాన్ ను మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు పంపిస్తున్నారు. అసలు నాకు ఆ అర్హతే లేదా? అని నగ్మా ట్విటర్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు వెనుకబడి పోయింది అంటూ ఓ ట్వీట్‌లో నిరాశ వ్యక్తం చేశారు.
నగ్మా దక్షిణాదిన హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ డీఎంకే మిత్రపక్షంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండటంతో ఓ స్థానం కాంగ్రెస్‌కు కేటాయించారు. సీనియర్ నేత చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం కేటాయించింది. నగ్మా అసంతృప్తిపై ఆయన పరోక్షంగా స్పందించారు. పార్టీ నిర్ణయమే అంతిమమన్నారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల కంటే ప్రతిభావంతులైన వారు కూడా ఉంటారన్నారు. నగ్మా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారం చేస్తున్నారు. అయినా గుర్తింపు లభించలేదని బాధపడుతున్నారు.