Mukesh Ambani Family : దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపులు కలకలం రేపాయి. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న హర్‌కిసాన్‌దాస్ ఆసుపత్రికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నిందితుడు ఒకే నంబరు నుంచి మూడు, నాలుగు కాల్స్ చేసినట్లు సమాచారం. ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబయిలోని డీడీ మార్గ్ పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమిక సమాచారం.
అసలేం జరిగింది?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి సోమవారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న హర్ కిసాన్ దాస్ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మళ్లీ అదే నంబరు నుంచి మూడు, నాలుగు సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆసుపత్రి యాజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ముంబైలోని డీడీ మార్గ్ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నంబరు ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి మానసికస్థితి సరిగా లేదని తెలుస్తోంది. ఆసుపత్రి ఫోన్ నెంబర్ ను గూగుల్‌లో సెర్చ్ చేసి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
స్కార్పియో కలకలం
గతేడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్ హీరేన్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. మొదట ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేనే ఘటనకు ప్రధాన సూత్రధారిగా తేలింది. అప్పట్లో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. నాటి నుంచీ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.
స్వాతంత్ర్య వేడుకల్లో అంబానీ కుటుంబం
మరోవైపు రిలయన్స్ అధినేత కుటుంబంతో సహా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముంబయిలోని తన నివాసం ఆంటిలియాలో సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీతో కలిసి స్వతంత్ర వేడుకలు జరుపుకున్నారు. ముకేశ్ మనవడిని ఎత్తుకోగా నీతా అంబానీ చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని మా తుఝే సలాం అని నినదించారు. కేంద్రం పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అంబానీ నివాసం ఆంటిలియా త్రివర్ణ వెలుగుల్లో కళకళలాడింది.
Also Read : Independence Day 2022: మహాత్ముడు రాముడైతే, నెహ్రూ హనుమంతుడు - ఆ చిత్రాలు చెప్పిన కథలేంటి?