విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. విడాకుల తీసుకున్న భార్య.. ఉద్యోగం చేసినంత మాత్రాన భరణానికి అనర్హురాలిగా చెప్పలేమని ప్రకటించింది. పని చేస్తూ ఆదాయం పొందుతున్నప్పటికీ భరణం ఇవ్వాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. 


మహారాష్ట్ర, కొల్హాపూర్‌కు చెందిన ఓ భర్త వేసిన పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. తన భార్య ఉద్యోగం చేస్తుందనీ.. విడాకుల టైంలో భరణం ఇవాల్సిన అవసరం లేదంటూ కోర్టుకెళ్లాడు సదరు మహిళ భర్త.


ఆ వ్యక్తి వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం... విడాకులు తీసుకున్న భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆదాయం వస్తున్నా భరణం పొందే హక్కును కాదనలేమని తీర్పు చెప్పింది. ఆమె ఉద్యోగి అయినప్పటికీ భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. 


మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన పిటిషనర్‌లకు 2005లో వివాహమైంది. ఈ దంపతులకు  ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చాలా రోజుల గొడవలు తర్వాత భర్తపై భార్య గృహహింస కేసు పెట్టారు. దీంతో ఇద్దరూ కలిసి ఉండటం వీలు కాదని గ్రహించి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2015లో విడాకులు కూడా తీసుకున్నారు. తనతో ఉన్న కుమారిడి పోషణ కోసం నెలకు 2 వేల రుపాయలు ఇప్పించాలని కోర్టును కోరారు సదరు మహిళ. ఈ రిక్వస్ట్‌పై విచారించిన జిల్లా మెజిస్ట్రేట్‌.. నెలకు 2వేలు ఇవ్వాలని భర్తను ఆదేశించారు. కుమారుడి పోషణతోపాటు తనకు కూడా నెలకు ఐదు వేల రూపాయల భరణం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. 


సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు భర్త. తన భార్య ఉద్యోగం చేస్తుందని అందుకే ఆమెకు ప్రత్యేకంగా భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్‌జే జమదార్... ఇరు పక్షాల వాదన విన్న తర్వాత సంచలన తీర్పు వెల్లడించారు. 


ఇప్పుడు మహిళలు కూడా పని చేయాల్సిన అవసరం ఉందని.. అందుకని ఆమె పని చేస్తున్నంత మాత్రాన భరణానికి అనర్హురాలిగా చెప్పలేమన్నారు. దీంతో సెషన్స్ కోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. ఈ తీర్పు ఉద్యోగం చేస్తూ విడాకులు తీసుకుంటున్న చాలా మందికి ఉపశమనం లాంటిందని న్యాయనిపుణలు అభిప్రాయపడుతున్నారు. 


Also Read: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే