Covid XE Variant : భారత్ లో ఇప్పుడిప్పుడే కరోనా క్రమంగా తగ్గుతుందన్న తరుణంలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ XE మొదటి కేసు ముంబయిలో నమోదు అయింది. దిల్లీలోని NCDC ఈ కేసును అధికారికంగా ధ్రువీకరించదని బీఎంసీ అధికారులు శనివారం తెలిపారు. ఈ వైరస్ సోకిన 67 ఏళ్ల వ్యక్తి, మార్చి 12న ముంబయి నుంచి గుజరాత్‌లోని వడోదరకు ప్రయాణించారని తెలిపింది. ఆయన జ్వరంతో బాధపడుతున్నాడని బీఎంసీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అతని శాంపిల్స్ దిల్లీకి పంపితే కొత్త వేరియంట్ ఓమిక్రాన్ XE అని తేలిందని వెల్లడించింది. అతను కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని, కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ఫిల్మ్ కాస్ట్యూమ్ డిజైనర్‌కు ఓమిక్రాన్ XE సోకిందని ముందు ప్రకటించారు. కానీ అది నిజం కాదని కేంద్రం వెల్లడించింది. 


XE వేరియంట్ అంటే ఏమిటి?


శీతాకాలంలో కోవిడ్-19 మూడో వేవ్ కు కారణమైన Omicron ఉప-వేరియంట్ XE, భారతదేశంలో ఇంతకు ముందు ఈ కేసులు నమోదు కాలేదు. తాజాగా ఈ వేరియంట్ కేసులు గుర్తించడంతో దేశంలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. భారత్ లో కోవిడ్ -19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పటికే రెండేళ్ల కంటే ఎక్కువ కనిష్ట స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. Omicron వేరియంట్‌లో భాగంగా XE రీకాంబినెంట్ ట్రాక్ చేశామని WHO ఏప్రిల్ 5న తన నివేదికలో పేర్కొంది. ప్రాథమిక అంచనాల ప్రకారం XE BA.2 కంటే 1.1 శాతం కమ్యూనిటీ వృద్ధి రేటును కలిగి ఉంది.


“SARS-CoV-2 వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అధిక స్థాయి విస్తరిస్తూ, రీకాంబినెంట్‌లతో సహా మరిన్ని వైవిధ్యాలు ఉద్భవించే అవకాశం ఉంది. కరోనా వైరస్ లో రీకాంబినేషన్ సాధారణం. ఇది ముందుగానే ఊహించాం" అని WHO నివేదిక చెబుతోంది. 


కొత్త వేరియంట్ కాదు 


ఇప్పటివరకు ఉన్న ఫలితాలను బట్టి చూస్తే కొత్త XE వేరియంట్‌ను కనుగొనడంలో ఆశ్చర్యం ఏమీ లేదని నేషనల్ IMA కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కో-ఛైర్మన్ రాజీవ్ జయదేవన్ గురువారం చెప్పారు. XE వేరియంట్ అనేది ఓమిక్రాన్ ను కొద్దిగా ట్యూన్-అప్ వెర్షన్, ఇది సరికొత్త వేరియంట్ కాదన్నారు. XE వేరియంట్ BA.1, BA.2 కలయిక అని జయదేవన్ చెప్పారు. ఇక్కడ X అంటే రీకాంబినెంట్ టైప్ E అనేది దాని ఆవిష్కరణ క్రమం అన్నారు. మ్యుటేషన్ రీకాంబినేషన్ అనేది వైరస్ లు మార్పు చెందడానికి ఉపయోగించే పద్ధతులు అన్నారు.