ఎవరైనా రోడ్లను.. వంతెలను కబ్జా చేస్తారు. కానీ ఏకంగా దొంగతనం  చేసి తీసుకెళ్లే వాళ్లకి ఓ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్  బీహార్ దొంగలకు ఉందని నిరూపితమయింది. ఎందుకంటే వారు ఏకంగా ఐదు వందల టన్నుల బరువున్న బ్రిడ్జిని దర్జాగా దొంగతనం చేసుకెళ్లిపోయారు.  చాన్సిస్తే చార్మినార్‌నూ కొట్టుకెళ్లిపోయే వాళ్లు ఉంటారంటే అప్పుడప్పుడూ నమ్మాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు నమ్మక తప్పదు.  ఎప్పుడూ ఉండే వంతెన అక్కడ లేకపోవడం చూసి ఏమయిందబ్బా అని తెలుసుకుంటే.. దొంగలెత్తుకుపోయారని తేలింది. ఈ వింత దొంగతనం బీహార్‌లో జరిగింది. 
 


బీహార్‌లోని రోహతాస్ జిల్లా నస్రీగంజ్‌లోని అమియావార్‌ అనే గ్రామంలో కాలువపై ఇనుప వంతెన ఉంది. 60 ఫీట్ల పొడవున్న, 500 టన్నుల బరువు ఉంటుంది.ఆ వంతెన శిథిలం కావడంతో పక్కన మరొకటి నిర్మించారు. దాన్నే ఉపయోగిస్తున్నారు. అయితే హఠాత్తుగా ఈ వంతెన మాయం అయిపోయింది. దీంతో గ్రామస్తులు వంతెన ఏమయిందా అని అధికారులను ఆరా తీశారు. వంతెన లేకపోవడం ఏమిటి అని ఆశ్చర్యపోయి వారు కూడా వచ్చి చూశారు. వారికీ కనిపించలేదు. వంతెన ఉండాలి కదా అనిఎంత వెదికినా కనిపించలేదు. దీంతో ఏం జరిగిందా అని ఆరా తీశారు. కొంత మంది గ్రామస్తులు మీరే కదా రిపేర్లు చేసింది ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించడంతో వారికి మైండ్ బ్లాంక్ అయింది. తాము అసలు రిపేర్లు చేయలేదని.. తమ పేరుతో రిపేర్లు చేస్తూ ఒక్కో పార్ట్‌ను ఊడ దీసి పట్టుకెళ్లిపోయారని గుర్తించారు. అధికారులుగా నటిస్తూ బుల్‌డోజర్లు, గ్యాస్ కట్టర్‌ల సాయంతో బ్రిడ్జి మొత్తాన్ని కోసి కూల్చివేసి వాహనాలపైకి ఎక్కించారు. మొత్తం మూడు రోజుల వ్యవధిలో దొంగలు బ్రిడ్జి మొత్తాన్ని మాయం చేశారు. బ్రిడ్జిని తీసుకెళ్తున్న కొందరిని గ్రామస్తులు ప్రశ్నిస్తే రిపేర్లకు అని చెప్పారట.





ఎన్నో దశాబ్దాలుగా శిథిలావస్థకు చేరిన ఈ ఇనుప వంతెనను ప్రజలు వినియోగించుకోవటం లేదు. ఈ వంతెనను తొలగించాలని గ్రామస్తులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గ్రామస్తులు వచ్చింది అధికారులేనని, తమ ఫిర్యాదు మేరకే వచ్చారని భావించారు.  అలా కాకుండా దొంగలు దానిని మాయం చేశారు. దాదాపు 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న ఇనుప వంతెన చోరీకి గురవ్వడంతో గ్రామస్తులకు, శాఖాధికారులకు తాము మోసపోయామని అర్థమైంది. ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి చోరీపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దొంగల్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
 
ఈ ఘటనపై బీహార్‌లోనూ రాజకీయ దుమారం రేగుతోంది. మూడు రోజుల పాటు బ్రిడ్జిను కట్ చేసి తీసుకెళ్తూంటే యంత్రాంగం పట్టించుకోకపోవడం ఏమిటని లాలూ తనయుడు .. ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకునే దొంగలు పని చేసుకెళ్లిపోయారని విమర్శించారు.