Money Laundering Case: ఎంబీఎస్ జ్యూయలర్స్ ఎండీ సుకేష్ గుప్తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ అరెస్టు చేసింది. రుణాల ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘన, పీఎంఎల్‌ఏ.. విదేశాల నుంచి గోల్డ్ ఎక్స్ పోర్ట్, బ్యాంక్‌ల నుంచి రుణాల ఎగవేత, పెద్ద నోట్ల రద్దు సమయంలో ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టి మొత్తం మూడు నేరాల కింద ఈడీ కేసులు నమోదు చేసి ఈడీ సుకేష్ గుప్తాను అరెస్టు చేసింది. ముసద్దీలాల్ జ్యూయలర్స్ సంస్థలో సోదాలు చేసిన ఈడీ.. ఎంబీఎస్ జ్యూయలర్స్‌తోపాటు సుకేష్ గుప్తాకు చెందిన సంస్థల్లో పెద్ద ఎత్తున బంగారం, బంగారు ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం చేసుకుంది.
భారీగా బంగారం సీజ్..
ఎంఎంటీసీ నుంచి పొందిన గోల్డ్ క్రెడిట్ కు ముసద్దీలాల్ ఎటువంటి పన్ను కట్టనట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంక్‌ల నుంచి రుణాలు పొంది ఇతర పనుల కోసం వాడుకున్న వైనాన్ని బహిర్గతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుకేశ్, అనురాగ్ భారీగా భూములు కొనుగోలు చేసినట్లు తేల్చారు. తాజా సోదాల్లో 100 కోట్లకుపైగా బంగారం, బంగారు ఆభరణాలను అధికారులు జప్తు చేశారు. 50 కోట్లకుపైగా విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తప్పించుకు తిరుగుతున్న సుకేష్ గుప్తా..
ఎంసీబీ సంస్థల్లో, సుకేష్ గుప్తా నివాసాల్లో సుమారు 30 గంటలుపాటు సోదాలు నిర్వహించి సుకేష్ గుప్తా ను ఈడీ అదుపులోకి తీసుకుంది. మొత్తం ఆరు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న సుకేష్ గుప్తాను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. మూడేళ్లుగా అనేక చిరునామాలతో సుకేష్ గుప్తా తప్పించుకుని తిరుగుతున్నారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఈడీ ఇప్పుడు బంగారం సీజ్ చేసింది. ఎంబిఎస్ జ్యువెలరీ యజమాని సుకేశ్ గుప్తా ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఎంబీఎస్ ముసద్దీలాల్ లో ఈడీ అధికారులు భారీగా బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారం కోటి ఎస్బీఐ ట్రెజరీ లో భద్రపరిచారు. గతంలో ఎంఎంటీసీ సంస్ద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది.
ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించి గతంలో అరెస్టు..
సుకేశ్ గుప్తాపై ఫెమా, పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ సీబీఐ సుకేశ్ గుప్తాను అరెస్ట్ చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఫేక్ ఇన్వాయిస్ సృష్టించి భారీ మోసాలకు పాల్పడ్డట్లు సీబీఐ గుర్తించింది. ఈడీ కార్యాలయం నుంచి సుకేష్ గుప్తాను వైద్య పరీక్షలకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈడీ అధికారులు సుకేష్ గుప్తాను కోర్టులో హాజరు పరచనున్నారు.
"రూ.110 కోట్లు తీసుకున్నా.. రూ.130 కోట్లు చెల్లించా"
తాను రూ.110 కోట్ల రుణం తీసుకున్నానని.. రూ. 130 కోట్లు తిరిగి చెల్లించానని సుకేష్ గుప్తా తెలిపారు. అయినా మనీ లాండరింగ్ అంటూ తనను అరెస్ట్ చేశారని అన్నారు.