Port Blair Name Changed as Sri Vijaya Puram: కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కాగా.. ఆ పేరును శ్రీ విజయపురం అని మార్పు చేశారు. ఇకపై పోర్ట్ బ్లెయిర్ కాకుండా శ్రీవిజయపురం అని మాత్రమే సంబోధించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. పోర్ట్ బ్లెయిర్ అనే పేరు బానిసత్వానికి ప్రతీక అని, అందుకే కేంద్ర పాలిత ప్రాంత రాజధాని పేరు మార్చాలని నిర్ణయం ఈ తీసుకుని శ్రీ విజయపురం అని చేసినట్లుగా తెలిపారు.


ఇందులో దేశాన్ని అన్ని బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం ఉందని అమిత్ షా అన్నారు. అందుకే హోం మంత్రిత్వ శాఖ పోర్ట్ బ్లెయిర్‌కు 'శ్రీ విజయపురం' అని పేరు పెట్టాలని నిర్ణయించిందని తెలిపారు. శ్రీ విజయపురం అనే పేరు మన స్వాతంత్య్ర పోరాటాన్ని, అందులో అండమాన్, నికోబార్ దీవుల నుంచి అందిన సహకారాన్ని ప్రతిబింబిస్తుందని హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. మన దేశ స్వాతంత్ర్యపు చరిత్రలో ఈ ద్వీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని.. చోళ సామ్రాజ్యంలో నౌకాదళ స్థావరం ఇక్కడే ఉండేదని అన్నారు. ఈ దీవులు ఇకపై దేశ భద్రత, అభివృద్ధిని వేగవంతం చేయడానికి రెడీగా ఉంటాయని అన్నారు.


నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఇక్కడే ఎగురవేశారని.. వీర్ సావర్కర్, సెల్యులార్ జైల్లో ఉన్న ఇతర స్వాతంత్ర్య సమరయోధులు దేశానికి స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం వరకు ఇదే ద్వీపం ఎంతో కీలక పాత్ర పోషించిందని హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. అండమాన్, నికోబార్‌లోని వివిధ దీవుల పేర్లను మోదీ ప్రభుత్వం గతంలో కూడా మార్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపానికి రాస్ ఐలాండ్ అని పేరు పెట్టింది. దీంతో పాటు నీల్ దీవికి షహీద్ ద్వీప్ అని, హేవ్ లాక్ దీవికి స్వరాజ్ ద్వీప్ అని పేర్లు మార్చారు.