PM Modi US Tour: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సొంత నగరమైన డెలావెర్‌లో జరగనున్న క్వాడ్ సమ్మిట్ కోసం ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు పయనమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా కట్టడి సహా ఆ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా విల్మింగ్‌టన్‌లో జరగనున్న ఈ భేటీలో.. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాధినేతలతో మోడీ సంప్రదింపులు జరపనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటిపై ఇంకా స్పష్టత రాలేదు.
దేశాధినేతలతో చర్చలకు ఉత్సాహంగా ఉన్నా: మోదీ
ఇండో పసిఫిక్ రీజియన్ ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా ప్రధాన భాగస్వాములుగా ఈ క్వాడ్ ఏర్పడింది. ఈ క్వాడ్ ముఖ్య ఉద్దేశ్యం ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా దురాగతాలు అడ్డుకోవడం సహా ఈ నాలుగు దేశాల ప్రయోజనాలను సమష్ఠిగా కాపాడుకోవడం. తదుపరి సమ్మిట్ భారత్‌లో జరగనుండగా.. ఈ సమ్మిట్ నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తొంది. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌కు ఇదే చివరి క్వాడ్ సమావేశం కానుండగా.. ఆయన తన సొంత ప్రాంతమైన డెలావెర్‌లో ఈ సమ్మిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్‌లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియన్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సహా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో చర్చలకు ఉత్సాహంగా ఉన్నానంటూ.. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు మోదీ తెలిపారు. జోబైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుగుతాయి. డెలావర్‌లోనే కాన్సర్ మూన్‌షూట్‌లోనూ పాల్గొంటారు. ఈ భేటీ అనంతరం నరేంద్రమోదీ న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అమెరికన్ టెక్ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో ఇండియన్ కమ్యూనిటీతో భేటీ అవుతారు. క్వాడ్ సమ్మిట్‌లో.. ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఉన్న ప్రపంచ జనాభాలో ఆరోవంతు మంది ప్రయోజనాలు కాపాడడమే తన లక్ష్యంగా మోదీ చెప్పారు.
ట్రంప్‌తో భేటీపై రాని స్పష్టత:
నరేంద్రమోదీ టూర్‌పై కొద్ది రోజుల క్రితం అమెరికా మాజీ ప్రెసిడెంట్.. ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ అమెరికా వస్తే తనతో భేటీ అవుతానని చెప్పారు. అయితే ఈ భేటీకి సంబంధించి ఇంత వరకూ ఏ విధమైన అధికారిక ప్రకటన ఇరు వర్గాల నుంచి రాలేదు. కొద్ది రోజుల క్రితం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ వాణిజ్య పాలసీల విషయంలో భారత్‌ను బిగ్ అబ్యూసర్‌గా పేర్కొన్నారు. అయితే మోదీ చాలా గొప్ప వ్యక్తని అదే సమయంలో వ్యాఖ్యానించారు. అతడితో భేటీకి ఆతృతగా ఎదురు చూస్తున్నానని.. ఈ టూర్‌లో అతడ్ని కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి.. డొనాల్డ్‌తో మోడీ భేటీపై భారత విదేశాంగ శాఖ ఏ విధమైన ప్రకటనా చేయలేదు. టూర్‌లో ఆ విధమైన అంశమేమీ లేదు. ఒక వేళ మోదీ ట్రంప్‌ను కలిస్తే రిపబ్లికన్ పక్షం వహించారన్న అపవాదు వచ్చే అవకాశం ఉంది. అందుకే భారత్ ట్రంప్‌తో భేటీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒక వేళ ప్రధాని మోదీ.. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రాట్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయిన కమాల హారిస్‌తో కూడా సమావేశమయ్యే పక్షంలో ట్రంప్‌తో భేటీకి కూడా అవకాశాలు ఉంటాయని భారత్ అమెరికా సంబంధాల నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు